AP Congress President YS Sharmila Sensational Tweet on YS Jagan: వైసీపీ నేతలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. వైసీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదని ఆరోపించారు. కళ్లకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్లు లేదన్నారు. ఇప్పటికీ అద్దంలో ముఖం చూసుకున్నా చంద్రబాబు కనిపించడం చాలా బాధాకరమన్నారు. ఏది చేసినా అర్థం, పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనమన్నారు. స్వయంశక్తితో ఎదుగుతుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఓర్వలేక, అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం మీ చేతకానితనానికి నిదర్శనమన్నారు. 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా మీ నీచపు చేష్టలు ఇంకా మారలేదన్నారు. అసత్యాలు వల్లె వేయడం మానుకోలేదన్నారు. నిజాలు జీర్ణించుకోలేని మీరు ఇక ఈ జన్మకు మారరని రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థమైందంటూ ఘాటుగా పేర్కొన్నారు.
ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసు అన్నారు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసు అన్నారు. తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి, రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి, స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ఆరోపించారు. ప్యాలెస్‌లు కట్టుకొని సొంత ఖజానాలు నింపుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్టు అని తెచ్చి ప్రజల ఆస్తులు కాజేయాలని చూశారని చెప్పుకొచ్చారు. రుషికొండను కబ్జా చేయాలని చూశారని దుయ్యబట్టారు. మొత్తంగా ప్రధాని మోదీ దోస్తులకు రాష్ట్రాన్ని దోచి పెట్టారని ఆరోపించారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశంలో మోదీకి మద్దతుగా నిలిచారని చెప్పారు.
ఎవరో ఒకరి సేవలో తరించాల్సిన కర్మ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలకు పట్టలేదన్నారు. పులి బిడ్డ పులిబిడ్డే అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేశారు. అన్ని పార్టీలు బీజేపీకి గులాంగిరీ చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ మాత్రమే ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తుందన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకి పోవడానికి వైఎస్ జగన్‌కు ఎందుకు భయం అని ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లుకు మద్దతు పలికి ముస్లింలకు ఇఫ్తార్ విందులో చంద్రబాబు విషం పెట్టారని చేసిన తమ ఆరోపణలు వినపడకపోవడం సిగ్గు చేటన్నారు. ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకుంటే అసెంబ్లీకి వెళ్లి పోలవరం మీద ఎందుకు ప్రశ్నించలేదన్నారు. అసెంబ్లీ వేదికగా సూపర్ సిక్స్ మోసాలను ఎందుకు ఎండగట్టలేదు? అని ప్రశ్నించారు. మీ నీచపు కుయుక్తులతో కాంగ్రెస్‌ను ఖాళీ చేయాలనే కుట్ర తప్ప ప్రజా సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎదగడం చూసి వైఎస్ జగన్ భయపడుతున్నారు అనేది పచ్చి నిజమని షర్మిల ఎక్స్‌లో పేర్కొన్నారు.