Site icon Prime9

Ap Cm Jagan : కావలిలో సీఎం జగన్.. చుక్కల భూముల సమస్యకు ఇక చెక్.. ఎన్ని లక్షల మంది లబ్ది పొందారంటే ?

ap cm jagan decision about dotted lands

ap cm jagan decision about dotted lands

Ap Cm Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లా కావలిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకుని, బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు చెక్‌ పెట్టారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతులకు ఆయా భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు కలుగుతుంది. దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 2,06,171 ఎకరాల భూములపై రైతులకు సర్వ హక్కులు కలగనున్నాయి.

చుక్కల భూముల సమస్యకు ఇక చెక్ (Ap Cm Jagan)..

వందేళ్ల క్రితం బ్రిటిష్‌ కాలంలో భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ లేదా ప్రైవేటు భూమి‘ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులలో (రీ సెటిల్మెంట్‌ రిజిస్టర్‌ – ఆర్‌ఎస్‌ఆర్‌) పట్టాదారు గడిలో ‘చుక్కలు‘ పెట్టి వదిలేశారు. అవే చుక్కల భూములు. వీటిని రైతులు అనుభవిస్తున్నా, సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభు­త్వం వీటిని నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. దీంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పుడు తాజాగా వైఎస్‌ జగన్‌ ఈ భూములపై రైతులకే సంపూర్ణ హక్కులు ఉండాలని నిర్ణయించి నిషేధిత జాబితా నుంచి తొలగించారు.

 

రైతులు రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా ఈ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిషేధిత జాబితా నుంచి తొలగించారు. జిల్లా కలెక్టర్ల ద్వారా చుక్కల భూములను పట్టా భూములుగా మారుస్తూ 22ఏ(1)(ఈ) నుండి డీ నోటిఫై చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ భూములపై రైతులకు సర్వ హక్కులు లభించాయి. వారు వాటిని అమ్ముకొనేందుకు, రుణాలు పొందడానికి, తనఖాకు, బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు కలిగింది. వీటిపై రెవెన్యూ సమస్యలు, సలహాల కోసం రైతులు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1902 సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఇక ఈ నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Exit mobile version