AP Assembly Budget Session 2025 day 2: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో తొలి రోజు వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ఆందోళనకు దిగడంతో పాటు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజాస్వామ్య విలువలు పాటించాలని కోరారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే మాట్లాడటానికి అవకాశం ఉన్నప్పటికీ ఇష్టారీతిన ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యం కాదన్నారు.
ఇదిలా ఉండగా, రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఇవాళ మాజీ సీఎం జగన్ సభకు హాజరుకావడం లేదు. అయితే గవర్నర్ ప్రసంగిస్తుండగా.. సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత్వం మరిచి ప్రవర్తించడంపై స్పీకర్ మాట్లాడారు. తమ పార్టీ నేతలు చేస్తున్న తీరును నియంత్రించాల్సి ఉండగా.. తాను కూడా కూర్చుని నవ్వుకుంటారా ? అని అడిగారు. అలాగే ఓ సీనియర్ నాయకుడు బొత్స కూడా పక్కనే ఉండి జగన్ చేసేది తప్పని చెప్పలేదని ఆక్షేపించారు.