Cheetah Trapped : తిరుమల అలిపిరి నడకమార్గంలో అటవీశాఖ అధికారులు తాజాగా ఐదో చిరుతను పట్టుకున్నారు. నరసింహస్వామి ఆలయం, ఏడవ మైలు రాయి మధ్యలో చిరుత చిక్కినట్లు సమాచారం అందుతుంది. నాలుగు రోజుల క్రితమే చిరుత కోసం బోన్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆపరేషన్ చిరుత విజయవంతం అయినట్టు అధికారులు చెబుతున్నారు. జూలైలో 3 చిరుతలను పట్టుకున్న అధికారులు.. సెప్టెంబర్ 7న నాలుగో చిరుతను .. తాజాగా 5వ చిరుతను పట్టుకున్నారు.
అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం చిక్కిన చిరుత వయసు సుమారు 10 సంవత్సరాలుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు చిక్కిన చిరుతాల్లో ఇదే అతి పెద్దది అని వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ చిన్నారి చిరుత దాడిలో మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మరో చిన్నారిపై కూడా దాడి జరగగా.. తిరుమల అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. చిరుత జాడలను బట్టి బోనులను ఏర్పాటు చేసి బంధించారు.
బాలిక మృతి ఘటన తరువాత నడక మార్గంలో భక్తుల రద్దీ తగ్గింది. కాగా నడకమార్గంలో భక్తులకు టీటీడీ అధికారులు చేతి కర్రలు ఇచ్చారు. ఈ ఘటనలపై టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. చేతిలో కర్ర ఉంటే భక్తుల్లో ఆత్మ విశ్వాసం, మనోధైర్యం పెరుగుతుందని అన్నారు. చేతిలో కర్ర ఉంటే జంతువులు దాడి చేయవనే శాస్త్రీయ వాదన ఉందని తెలిపారు. అయితే టీటీడీ నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతున్నారు. చేతికర్రలు ఇస్తే ఉపయోగం ఉండదని, ఫెన్సింగ్ వేయాలని కోరుతున్నారు.