Bus Accident : ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు ప్రజలకు భయాందోళనలు కలగజేస్తున్నాయి. విజయవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించి ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్న విషయం మరువక ముందే తాజాగా అనంతపురంలో మరో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అనంతపురం కలెక్టరేట్ సమీపంలో జరిగిన ఈ దారుణ ఘటనలో హిందూపురం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా వాహనాల మీదకు దూసుకెళ్లింది.
ఈ హఠాత్ పరిణామంలో సంఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతుంది. బస్సు నంబర్- AP02Z0499 గా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక నిన్న ఉదయం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో జరిగిన ఘోర ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. దీంతో 10 నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బస్టాండ్ లోని 12వ నెంబర్ ప్లాట్ ఫాంపై బస్సు కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
రివర్స్ గేర్ బదులుగా డ్రైవర్ ఫస్ట్ గేర్ వేయడంతో బస్సు ప్లాట్ ఫాంపై ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి వెళ్లిందని, దీంతో బస్సు చక్రాల కింద నలిగి ముగ్గురు చనిపోయారని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెల్లడించారు. ఈ బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ.. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు పూర్తి చికిత్స తామే బాధ్యత వహిస్తామని తెలిపారు. అలానే ప్రమాద ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆ కుటుంబాలకు అందించాలని అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని తెలిపారు.