Site icon Prime9

Meenakshi Natarajan: అధికారాన్ని పేదల కోసమే ఉపయోగించాలి.. పార్టీ నేతలకు ఏఐసీసీ ఇన్చార్జీ మీనాక్షి దిశా నిర్దేశం

AICC In-charge Meenakshi Natarajan in Hyderabad: ‘పేదవాడి కోసం పని చేయాలి. పేద ప్రజల మొఖంలో నవ్వులు చూడాలి. అప్పుడే మనం పని చేసినట్టు’ అని ఏఐసీసీ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో పోరాట శక్తి ఉందని, అనేక రకాలుగా పోరాటాలు చేయడంతో నే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని అన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం ‘భారత్ జోడో’ యాత్ర నిర్వ హించి ఒక మైదానాన్ని తయారు చేశారన్నారు. మనం దాని కోసం పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధితోపాటు ప్రజలకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తుందని, దీన్ని ప్రజలకు పార్టీ నేతలు వివరించాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పోరాటం చేయాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ ఎలాంటి పోరాటానికి అయినా సిద్ధంగా ఉందని మీనాక్షి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలని, అందుకు పార్టీ శ్రేణులు పని చేయాలన్నారు. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేశారన్నారు. అలాంటి కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. కార్యకర్తలు ఫోన్ చేస్తే మాట్లాడుతానన్నారు. ఫ్లెక్సీలు, ఫొటోలు పెడితే నాయకులు ఎన్నికలలో గెలవరని, నిత్యం ప్రజలలో ఉంటేనే వారు గెలుస్తారని చెప్పారు. ‘నా కోసం రైల్వే స్టేషన్లకు లీడర్స్ రావొద్దు. నా బ్యాగ్ లు ఎవరు మోయద్దు. నాకు బలం లేకపోతే నేనే మీ సహాయం అడుగుతా, మీ ఆత్మ గౌరవాన్ని ఎక్కడ తక్కువ చేసుకోవద్దు.. మీరు మీ పని చేసుకోండంటూ’ మీనాక్షి హితవు పలికారు.

‘మంచిని మైక్‌లో చెప్పి, చెడును చెవిలో చెప్పాలని’ పార్టీ నేతలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. మీనాక్షి నటరాజన్ లాంటి అంకితభావం కలిగిన నాయకురాలిని ఇన్చార్జ్‌గా నియమించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలలోకి తీసుకెళ్లడం నిరంతర ప్రక్రియ అన్నారు. పార్టీ జెండా మోసినవారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే పార్టీ కోసం కష్టపడినవారికే నామినేటెడ్ పదవులలో నియమించామని, సుదీర్ఘకాలంగా పని చేసిన కొంతమందికి అవకాశాలు రాలేదని సీఎం తెలిపారు. అలాంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. వీరికి రాబోయే రోజుల్లో వారికి తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. మార్చి 10 లోగా అన్ని జిల్లాలలో నియామకాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రులను సీఎం ఆదేశిం చారు. పదవులు వచ్చిన వారు పార్టీ కోసం కష్టపడాలని, పనితీరు సరిగా లేని వారికి రిన్యూవల్ ఉండదని రేవంత్ రెడ్డి సుతిమెత్తగా హెచ్చరించారు.

పార్టీ నేతలు, కార్యకర్తలు పాత అలవాట్లు మాని నిరాడంబరంగా ఉండాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ నేతలను కోరారు. ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యకర్తల పోరాట ఫలితంగానే అధికారంలోకి వచ్చామని, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన మాటను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమం, అభివృద్ధి పనులు, ఏఐసీసీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

Exit mobile version
Skip to toolbar