Site icon Prime9

Rampachodavaram : అల్లూరి జిల్లాలో పసికందు అదృశ్యం.. పోలీసుల అదుపులో మహిళ

Rampachodavaram

Rampachodavaram

Rampachodavaram : అల్లూరి జిల్లా దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పసికందు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. వై.రాయవరం మండలం పాముగుంది గ్రామానికి చెందిన సాదల కళావతి గుత్తేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు కామెర్లు రావడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదే సమయంలో గుర్తుతెలియని మహిళ వారి వద్దకు వచ్చి పాపను ఇంక్యుబేటర్‌లో పెట్టాలని చెప్పింది. ఆసుపత్రి సిబ్బంది అని భావించిన తల్లిదండ్రులు పాపను సదరు ఆమెకు అప్పగించారు. ఐదు రోజుల బిడ్డతో సహా మహిళ అక్కడి నుంచి పరారైంది. ఈ దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. విషయాన్ని గ్రహించిన పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

 

డీఎస్పీ ప్రశాంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు..
రంపచోడవరం డీఎస్పీ ప్రశాంత్‌కుమార్‌ ఆధ్వర్యంలోని బృందం ఘటనపై వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. గులాబీ రంగు దుస్తులు ధరించిన గుర్తుతెలియని మహిళ పాపను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు బృందాలుగా ఏర్పడి పాప ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అల్లూరి జిల్లా కేంద్రం నుంచి భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సులో చింతూరు సమీపంలో శిశువును అపహరించి తీసుకెళ్తున్న మహిళను పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మహిళ, పసికందును రంపచోడవరం తరలిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar