Dogs Attack In Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. వీధి కుక్కల దాడిలో 18 నెలల చిన్నారి మృతి

తెలుగు రాష్ట్రాలలో వీధి కుక్కలు ప్రస్తుతం ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలు ఇప్పటికే పలువురు ప్రాణాలు తీశాయి. ముందుగా హైదరాబాద్ లో ఇటీవల ఓ బాలుడిపై కుక్కలు దాడి చేయగా.. అతడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఇలాంటి ఎన్నో

  • Written By:
  • Publish Date - April 22, 2023 / 03:36 PM IST

Dogs Attack In Srikakulam : తెలుగు రాష్ట్రాలలో వీధి కుక్కలు ప్రస్తుతం ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలు ఇప్పటికే పలువురు ప్రాణాలు తీశాయి. ముందుగా హైదరాబాద్ లో ఇటీవల ఓ బాలుడిపై కుక్కలు దాడి చేయగా.. అతడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఇలాంటి ఎన్నో ఘటనలు బయటకు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కోచోట ఒక్కొక్కరూ గాయపడ్డారు.. పలు ఘటనల్లో మృత్యువాత కూడా పడ్డారు. ఇప్పుడు తాజాగా శ్రీకాకుళం జి.సిగడాం మండలం మెట్టవలసలో తీవ్ర విషాదం జరిగింది. ఇంటి ఎదురుగా ఉన్న వీధిలో ఆడుకుంటున్న చిన్నారిపై.. వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల దాడిని గమనించిన కుటుంబ సభ్యులు.. చిన్నారిని చికిత్స నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. పసిపాప మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జి.సి గడాం మండలం మెట్టవలసకు చెందిన రాంబాబు, రామలక్ష్మి దంపతుల చిన్నారి సాత్వికకు 16 నెలలు. వీరు టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు.. పాపను అక్కడే ఉంచిన తల్లి పక్కకు వెళ్లి పని చేసుకుంటోంది. చిన్న కుమార్తె సాత్విక నిద్రపోతుండగా.. చూడమని మూడేళ్ల పెద్ద కుమార్తె కుసుమకు చెప్పింది. ఇంతలో ఓ కుక్క షాపులోకి వచ్చింది.. సాత్వికను ఈడ్చుకుంటూ తోటలోకి లాక్కెళ్లింది. కొద్దిసేపటి తర్వాత పెద్ద కుమార్తె కుసుమ తల్లికి విషయం చెప్పింది. తల్లిండ్రులు వెంటనే తోటలోకి పరుగున వెళ్లగా.. అప్పటికే పాప ఒంటిపై కుక్కకాట్లు, రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో వెంటనే చిన్నారిని హుటాహుటిన రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు.

చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.. కుక్కల నియంత్రణపై అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని.. స్థానికులు మండిపడుతున్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్‌ చేస్తున్నారు.. మరోవైపు తాజాగా మెదక్ జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఏడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి.. వెంటనే బాలికను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పాప ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందుకుంటోంది.