Site icon Prime9

Global Investors Summit 2023 : గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ కు సిద్దమైన విశాఖ.. పోలీసుల భద్రతా వలయంలో కట్టుదిట్టంగా!

all arrangements ready for Global Investors Summit 2023 in vizag

all arrangements ready for Global Investors Summit 2023 in vizag

Global Investors Summit 2023 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 3, 4 తేదీల్లో జరగనున్న “గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌”కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఈ సమ్మిట్ నిర్వహించనున్నారు. సుమారు 2 లక్షల 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదికలను సిద్దం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో ఏడుగురు కేంద్ర మంత్రులు, 40 దేశాల నుంచి రాయబారులు, 25 దేశాల ప్రతినిధులు.. మన దేశానికి చెందిన 30 మంది పారిశ్రామిక దిగ్గజాలు రాబోతున్నారు. మార్చి 3న  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఈ సమ్మిట్ మంచి వేదిక కానుంది.

సమ్మిట్ కి హాజరు కానున్న అంబానీ, అదానీ, మంగళం బిర్లా, పలువురు ప్రముఖులు..

కాగా ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం సుమారు వంద కోట్లతో విశాఖ నగరాన్ని సుందరీకరించారని సమాచారం అందుతుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. ఆరుగురు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండు రోజులపాటు విశాఖ నుంచే కార్యకలాపాలు కొనసాగించనున్నారు. అలానే ప్రత్యేక అతిథులుగా కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఎండీ, సీఈవో సంజీవ్‌ బజాజ్, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ నవీన్‌ జిందాల్.. పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

 

 

గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నేపధ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు (Global Investors Summit 2023)..

ఇక మూడు రోజుల పర్యటన కోసం సీఎం జగన్  ఈ రోజు సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. ప్రముఖుల రాకతో విశాఖలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రముఖుల తాకిడి పెరుగుతుండడంతో విశాఖ ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాలు.. హై సెక్యూరిటీ జోన్ గా మారిపోయాయి. 2500 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే సమ్మిట్ జరిగే ఏయూ నుండి విమానాశ్రయం వరకు, బీచ్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని.. ట్రాఫిక్‌ రద్దీ, వీఐపీల తాకిడి దృష్ట్యా.. వాహనదారులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు. ఇక, శుక్ర, శనివారాలు బీచ్ కు వెళ్లేవారు తమ వాహనాలను ఏపీఐఐసి గ్రౌండ్ లో పార్క్ చేసుకోవాలని సూచించారు సీపీ శ్రీకాంత్‌. సమ్మిట్ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్ పరిసరాల్లో వీఐపీల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల భారీ ట్రాఫిక్ జామ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకాలు సాగించాలని సూచించారు. ముఖ్యంగా బీచ్ రోడ్‌లో ట్రాఫిక్ జాం లేకుండా ఉండేలా చూస్తామన్నారు శ్రీకాంత్. ఈ రెండు రోజులూ ఎపిఐఐసి గ్రౌండ్స్‌లో తమ వాహనాలను పార్క్ చేయాలని కోరారు.

 

తొలిసారిగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో డాగ్‌ స్క్వేడ్‌ను వాడుతున్నారు. ఈ స్నిఫర్ డాగ్ టీమ్‌కి ‘కె9 స్క్వాడ్‌’గా పేరు పెట్టి భద్రతలో భాగం చేయనున్నారు. ప్రముఖులు విశాఖ రానున్న వేళ భద్రత చాలా ముఖ్యం. అందుకే ‘కె9 స్క్వాడ్‌’ను రంగంలోకి దించారు పోలీసులు. మరోవైపు విశాఖ లోని హోటళ్లు, లాడ్జీలు, రిసార్టులు, అతిథి గృహాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం, హెలిప్యాడ్‌లు, ప్రతినిధులు, వీఐపీలు బస చేసే హోటళ్ల వద్ద స్నిఫర్‌ డాగ్‌లు, బాంబు స్క్వాడ్‌లు మోహరించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version