CM Jagan : సీఎం జగన్ సభలో అపశ్రుతి- బస్సు నుంచి జారి పడిన 70 ఏళ్ల వృద్ధురాలు

ఏపీలో సభలు, సమావేశాల సందర్బంగా ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలు వార్తల్లో కెక్కుతున్నాయి. తాజాగా సీఎం జగన్ పాల్గొన్న రాజమండ్రి

  • Written By:
  • Publish Date - January 3, 2023 / 04:13 PM IST

CM Jagan : ఏపీలో సభలు, సమావేశాల సందర్బంగా ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలు వార్తల్లో కెక్కుతున్నాయి. తాజాగా సీఎం జగన్ పాల్గొన్న రాజమండ్రి సభలో ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. 70 ఏళ్ల వయసున్న ఆమె ప్రాణాపాయ స్థితిలో కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు వైద్యులు.

పింఛన్ కానుక వారోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆ వృద్ధురాలు చివరికి ఆస్పత్రిపాలైంది. పింఛన్ పెంపుని ప్రచారం చేసుకోవాలనుకుంటున్న ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తోంది. అదే సమయంలో కొత్తగా పింఛన్ తీసుకునేవారికి నేరుగా ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు వాలంటీర్ల సాయంతో ప్రభుత్వ సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో రాజమండ్రిలో పింఛన్ పెంపు వారోత్సవాల్లో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ సభకు భారీగా జన సమీకరణ జరిగింది. నేరుగా సీఎం జగన్ లబ్ధిదారులతో మాట్లాడే కార్యక్రమం కాబట్టి.. జిల్లా నలుమూలలనుంచి లబ్ధిదారుల్ని తీసుకొచ్చారు నాయకులు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలను ఇందుకోసం ఉపయోగించారు.

ఇలాసభ వద్దకు వచ్చిన బస్సుల నుంచి దిగే సమయంలో 70 ఏళ్ళకు పైగా వృద్ధురాలు జారిపడిపోయింది. రోడ్డు మీద పడిపోవడంతో.. వెంటనే పక్కన వేరే వాహనం ఆ వృద్ధురాలు మీదకు ఎక్కడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు.