Tspsc Group 4 Exam : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు (జూలై 1) గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి పరీక్ష జరగనుంది. రాత పూర్వకంగా చేపట్టనున్న ఈ పరీక్ష నుంచి 8,180 గ్రూప్-4 సర్వీసుల భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టుల కొరకు దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో శుక్రవారం రాత్రి వరకు 8.81 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు టీఎస్పీయస్సీ వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే 2,878 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలో రెండు పేపర్లను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. పరీక్ష సమాయానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
పేపర్ 1 జనరల్ స్టడీస్ – ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు
పేపర్ 2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.
ముందుగా ఉదయం సెషన్‌లో జరిగే పేపర్-1 పరీక్షకు 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. 9.45 గంటల తర్వాత గేట్లు మూసేస్తారు. అలాగే మధ్యాహ్నం జరిగే పేపర్-2 పరీక్షకు ఒంటి గంట నుంచే లోనికి అనుమతిస్తారు. 2.15 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు. పరీక్ష కేంద్రాలున్న పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపింది.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి తీసుకెళ్లాలి.
హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకపోయినా, బబ్లింగ్ సరిగ్గా చేయకపోయినా, బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ కాకుండా ఇతర ఏ పెన్ ఉపయోగించినా సదరు ఓఎంఆర్ పత్రం చెల్లుబాటు కాదని టీఎస్పీయస్సీ సూచించింది.
పరీక్షకు అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే అనుమతించబోమని, చెప్పులు వేసుకొని రావాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.
వాచ్, హ్యాండ్ బ్యాగ్, పర్సులను పరీక్ష హాలులోకి తీసుకెళ్లకూడదని స్పష్టం చేసింది.
ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్‌తో కూడిన కారు తాళాలు, విలువైన, నిషేధిత వస్తువులను ఎగ్జామ్ హాల్ లోకి తీసుకెళ్లడానికి అనుమతించారు.
గ్రూప్-4 OMR షీట్ లో హాల్‌టికెట్, ప్రశ్నపత్రం నంబరు, పరీక్ష కేంద్రం కోడ్ వేసి.. పేరు రాసి సంతకం చేయాల్సి ఉంటుంది.
ఈసారి థంబ్ తప్పనిసరి చేశారు. ప్రతి సెషన్ పరీక్ష ముగిశాక ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు అందజేసి, నామినల్ రోల్‌లో సంతకం చేసి వేలిముద్ర వేయాలి.
అభ్యర్థులు ఎట్టి పరిస్థితిలోనూ ప్రశ్నపత్రంపై సమాధానాలను మార్క్ చేయకూడదు.
పరీక్షకు అభ్యర్థికాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే.. అలాంటి వారిపై పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు ఆ అభ్యర్థిని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటిస్తారు.