Tollywood Film Producer Vedaraju Timber Dies of Health Problems: టాలీవుడ్ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత వేదరాజు టింబర్(54) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నిర్మాణ రంగంలో ఉన్న వేదరాజు సినిమాలపై ఆసక్తితో ఎంట్రీ ఇచ్చారు. అల్లరి నరేశ్‌తో మడత కాజా, సంఘర్షణ వంటి చిత్రాలను నిర్మించారు. మరో మూవీకి సన్నాహాలు చేసుకుంటుండగా.. ఈ దుర్ఘటన జరిగింది. దీంతో టాలీవుడ్ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అయితే, త్వరలో మరో సినిమా నిర్మించేందుకు వేదరాజు టింబర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతలోనే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయనను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు చికిత్స పొందుతున్న ఆయన ఆకస్మిక మృతి తెలుగు పరిశ్రమను విషాదంలోకి నెట్టేసింది. ఆస్పత్రికి వెళ్లిన వేదరాజు త్వరలో కోలుకుని తిరిగి వస్తారని అందరూ భావించారు. కానీ ఆకస్మిక మృతి కుటుంబ సభ్యులు, సన్నిహితులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వేదరాజుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఇవాల సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.