Telangana Assembly Sessions: అసెంబ్లీలో ఉద్రిక్తత.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎమ్మెల్యేలు నినాదాలు

Telangana Legislative Assembly Sessions 2024: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. దీంతో ప్లకార్డులు తీసుకెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు.

కాగా, లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం వేశారు. రైతులను .జైల్లో పెట్టడంపై చర్చకు వాయిదా తీర్మానించారు. ఆసిఫాబాద్‌లో పులి దాడిపై బీజేపీ వాయిదా తీర్మానించారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఏడాదిగా సర్పంచ్‌లకు రూ.691కోట్లు చెల్లించలేదన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే సర్పంచ్‌లను అరెస్ట్ చేశారన్నారు.

ఎస్ఎఫ్‌సీ, ఈజీఎస్ నిధులు డైవర్ట్ చేశారని, 16వ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు సైతం డైవర్ట్ చేశారని హరీష్ రావు ఆరోపించారు. సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని, గ్రామ పంచాయతీ లోపు బిల్లులు క్లియర్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని అడిగారు. తెలంగాణలో పల్లెలను బీఆర్ఎస్ హయాంలో దేశానికి ఆదర్శంగా నిలిచాయని వివరించారు. కావాలనే సర్పంచ్‌లపై కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు.

కాగా, అసెంబ్లీలో సర్పంచ్ బిల్లులు చెల్లించకపోవడంపై బీఆర్ఎస్ ప్రశ్నించింది. అయితే, దీనిపై మంత్రి సీతక్క స్పందించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగానే సర్పంచ్ పెండింగ్ బిల్లులు పడ్డాయని ఆరోపించారు. 2014 నుంచి సర్పంచ్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సర్పంచ్ పెండింగ్ బిల్లులు గతంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

పల్లె ప్రగతి నిధులు విడుదల చేయకపోవడం వల్లనే సర్పంచ్‌లకు బిల్లులు పెండింగ్‌లో పడ్డాయన్నారు. కాంట్రాక్టర్లకు రూ.1,200 కోట్లు విడుదల చేశామన్నారు. మంత్రి సీతక్క సరైన సమాధానం ఇవ్వలేదని బీఆర్ఎస్ నాయకులు వాకౌట్ చేశారు.

అంతకుముందు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. బీఏసీలో చర్చించకుండానే అసెంబ్లీ ఎజెండా ఖరారు చేయడం దారుణమన్నారు. టూరిజంపై చర్చించాల్సిన సమయం కాదని, లగచర్ల రైతుల అక్రమ అరెస్ట్‌లపై చర్చించాలని డిమాండ్ చేశారు. లగచర్ల రైతులు చేసిన తప్పు ఏంటని ప్రశ్నించారు. ఓ రైతుకు గుండెపోటు వస్తే.. ఆస్పత్రికి బేడీలు వేసి తీసుకెళ్లడం ఏంటని, దీనిని రైతులను అవమానించడమేని పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.