Telangana CM Revanth Reddy concludes successful Davos trip with record investments: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తైంది. దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. మూడు రోజుల దావోస్ పర్యటనలో భాగంగా పలు దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని కోరారు. కాగా, పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తెలంగాణ రైజింగ్ బృందం విజయవంతం అయింది. ఈ మేరకు మొత్తం పది కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది.
1.32 లక్షల కోట్లు
దాదాపు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. దావోస్ పర్యటనలో భాగంగా చేసుకున్న సరికొత్త ఒప్పందాలతో దాదాపు 46 వేల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే పెట్టుబడులు మూడింతలు మించాయని చెప్పుకోవచ్చు. మరోవైపు గురువారంతో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. దీంతో ఆయన హైదరాబాద్ బయలుదేరారు. శుక్రవారం సీఎం బృందం తిరిగి చేరుకోనుంది.
పెద్ద డీల్.. అమెజాన్‌తోనే
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు. దాదాపు రూ.60వేల కోట్ల ఇన్‌వెస్ట్‌మెంట్స్‌తో హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్‌లను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి. తెలంగాణలో క్లౌడ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించింది. ఒక బిలియన్ పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు సెంటర్లను గతంలోనే అభివృద్ధి చేసింది. ఈ మూడు కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. కొత్తగా చేపట్టే విస్తరణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది.
10 సంస్థలు ఇవే..
1. సన్ పెట్రో కెమికల్స్: 3400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో విద్యుత్తు. 5440 మె.వా సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు. రూ. 45,500 కోట్ల పెట్టుబడులు, 7వేల కొలువులు.
2. అమెజాన్ కంపనీ వెబ్ సర్వీసెస్: క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లతో పాటు ఏఐ వంటి టెక్నాలజీకి భారీ పెట్టుబడులు. రూ. 60,000 కోట్లు.
3. కంట్రోల్ ఎస్ : తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటాసెంటర్ క్లస్టర్ ఏర్పాటు, డేటా సెంటర్ కోసం రూ. 10వేల కోట్లు వెచ్చించనుంది. దీనివల్ల 3,600 మందికి ఉపాధి లభించనుంది.
4. జేఎస్ డబ్ల్యూ సంస్థ: రాష్ట్రంలో మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటుతో బాటు డిఫెన్స్ టెక్నాలజీ ఉత్పత్తులకు రంగం సిద్ధంచేసింది. దీనివల్ల రూ.800 కోట్ల పెట్టుబడులు, 200 ఉద్యోగాలు రానున్నాయి.
5. స్కైరూట్ ఏరో స్పేస్: తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు ఈ సంస్థ రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
6. మేఘా ఇంజనీరింగ్: 2160 మె.వా పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్రాజెక్టు, అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకు రూ.15000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వీటి వల్ల 5250 కొలువులు రానున్నాయి.
7. హెచ్‌సీఎల్ టెక్ సెంటర్: హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటుతో 5 వేల మందికి ఉపాధి లభించనుంది.
8. విప్రో : విస్తరణలో భాగంగా గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటుకు విప్రో ముందుకొచ్చింది. దీనివల్ల 5 వేల కొత్త కొలువులు రానున్నాయి.
9. ఇన్ఫోసిస్: విస్తరణలో భాగంగా పోచారంలో కొత్త ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు రూ. 750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీనివల్ల 17 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా.
10. యూనిలివర్ కంపెనీ: కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్, బాటిల్ క్యాప్‌లను ఉత్పత్తి యూనిట్‌ల ఏర్పాటుకు రంగం సిద్ధం. దీనివల్ల 1000 తక్షణ కొలువులు, వేలాది మంది రైతులకు లాభం చేకూరనుంది.