Site icon Prime9

CM Revanth Reddy: బీఆర్ఎస్ కాదు.. బీ‘ఆర్ఎస్ఎస్‌’ .. 40ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు సొంత ఆఫీస్

Telangana CM Revanth Reddy comments about AICC HQ inauguration in Delhi: బీఆర్‌ఎస్‌ అంటే.. ‘బీ-ఆర్‌ఎస్‌ఎస్’ అని, ఆర్ఎస్ఎస్ ఐడియాల‌జీతో వెళ్లేందుకు ఆ పార్టీ ప్ర‌య‌త్నిస్తోందంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేస్తోన్నఆరోప‌ణ‌ల‌నే తెలంగాణ‌లో బీఆర్ఎస్ చేస్తోంద‌ని విమ‌ర్శించారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ నూత‌న కార్యాల‌యం ప్రారంభోత్స‌వంలో పాల్గొని విలేక‌రుల‌తో మాట్లాడారు. రాహుల్‌ గాంధీ చెప్పిన‌ట్లు ఆర్ఎస్ఎస్‌తో త‌మ‌ది సిద్ధాంతపరమైన వైరుధ్య‌మ‌న్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఏ పోరాటం చేయ‌లేదు..
స్వాతంత్య్రం కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ ఏ పోరాటం చేయ‌లేద‌ని ఆరోపించారు. స్వాతంత్య్రం గురించి ప్ర‌శంసించేందుకు, చెప్పేందుకు వారు సిద్ధంగా లేర‌ని సీఎం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మోహన్ భాగవత్ అదే చెప్పార‌ని, స్వాతంత్య్ర పోరాటంతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, నేతలు త్యాగాలు చేసి స్వాతంత్య్రం తీసుకొచ్చార‌ని, దేశాన్ని ముందుకు నడిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంద‌ని రాహుల్ చెప్పార‌ని సీఎం వివ‌రించారు. బీజేపీ చెబుతున్న విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పనిలేద‌న్నారు.

మోదీ మోహన్ భాగవత్‌తో ఉన్నారా?
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మోహన్ భాగవత్‌తో ఉన్నారా? లేక దేశ స్వాతంత్య్రం కోసం అమరులైన లక్షలాది వెంట ఉన్నారా? స్పష్టం చేయాల‌ని రేవంత్ డిమాండ్ చేశారు. బీజేపీ నేత‌లు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తూ స్వాతంత్య్రం విష‌యంలో మోహన్ భాగవత్ మాట్లాడిన అంశాన్ని త‌క్కువ చేసే ప్రయత్నం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంలో మోదీ భాగవత్‌పై చర్యలు తీసుకుంటారా లేదా దేశ ప్రజలకు స్పష్టం చేయాల‌ని సీఎం డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్‌ నుంచి నేర్చుకోవాల్సింది ఏం లేదు..
బీఆర్‌ఎస్‌ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏం లేద‌ని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ‌లో చట్టం త‌న పద్ధతిలో నడిచేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రయత్నిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. ఎక్కడైనా దాడులు జరిగితే పోలీసులు చర్యలు చేపడతార‌ని, శాంతిభద్రతల సమస్య తలెత్తితే పోలీసులు జోక్యం చేసుకుని క్రిమినల్‌ కేసులు నమోదు చేశార‌న్నారు. గత ప్రభుత్వం హ‌యాంలో పోలీసులతో కలిసి బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్‌ కార్యాలయాలపై దాడులు చేశార‌ని, తాము అలా చేయ‌డం లేద‌ని సీఎం రేవంత్ తెలిపారు.

కాంగ్రెస్‌కు బీజేపీకి అదే తేడా..
140 ఏళ్ల చరిత్ర కలిగి కాంగ్రెస్ పార్టీ సొంత కార్యాలయం నిర్మించుకునేందుకు ఇన్నేళ్లు పట్టిందని, అదే నిన్నగాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలు 40ఏళ్ల సినియార్టీ మాత్రమే ఉన్న బీజేపీ స్వల్పకాలంలోనే కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయని రేవంత్ అన్నారు. తమ పార్టీ ప్రజల కోసం ఎంత నిస్వార్థంగా పని చేస్తుందో దీన్నే బట్టే అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల ఆర్థికస్థితిగతులు, కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితిగతి ఎలా ఉందో గమనించాలన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి దేశాభివృద్ధి అవసరమైన నిర్ణయాలు, ప్రణాళికలు రచించబడతాయన్నారు.

Exit mobile version