Telangana Cabinet Meeting Ended: సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ 2 గంటలపాటు సాగింది. అయితే ఆమోదం తెలిపిన ఈ నివేదికలను మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు.
కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో భాగంగా మాట్లాడారు. దేశంలోనే మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామన్నారు. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించామన్నారు.
కులగణన విషయంలో ప్రధానిపై కూడా ఒత్తిడి పెరుగుతుందని సీఎం రేవంత్ వివరించారు. అయితే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెళ్తామన్నారు. వర్గీకరణపై మంత్రివర్గ ఉపసంఘం, ఏక సభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. ప్రతిపక్ష నేత సభకు రావాలి కదా? అని ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఎక్కడ ఉందో తెలియదని విమర్శలు చేశారు.
అనంతరం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేలకు నోటీసులు ప్రొసీజర్‌లో భాగమేనని చెప్పారు. కొంతమంది ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నారని, సిరిసిల్లలో ఉపఎన్నిక వస్తుందేమో? అని రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోసం కులగణన చేయలేదని, అభివృద్ధి ఫలాలు అందించాలనేదే మా తాపత్రయమని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాలతో కమిషన్ వేశామని, కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ నిర్ణయం తీసుకుందని వివరించారు.