Site icon Prime9

Taliban cleric Sheikh Rahimullah Haqqani: తాలిబన్‌ మత గురువు రహీముల్లా హక్కానీ దుర్మరణం

Afghanistan: తాలిబన్‌ మత గురువు రహీముల్లా హక్కానీ ఐసీస్‌ ఆత్మాహుతి దాడిలో మృతి చెందారు. ఆఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌ మదర్సాలో ఆయనను లక్ష్యంగా చేసుకొని ఐసిస్‌ ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఇటీవల కాలంలో ఆయన బాలికలు స్కూళ్లకు వెళ్లి విద్యనభ్యసించవచ్చునని పలుమార్ల బహిరంగ మద్దతు ప్రకటించారు. ఇది ఐసిస్‌ జిహాదీ గ్రూపునకు ఆగ్రహం తెప్పించింది. గతంలో ఆయనపై రెండు సార్లు జరిగిన హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నారు. అక్టోబర్‌ 2020లో కూడా పాకిస్తాన్‌లో ఆయనపై హత్యాయత్నం జరిగింది. అప్పుడు కూడా తృటిలో తప్పించుకున్నారు.

కాబూల్‌లోని మదర్సాలో షేక్‌ రహిముల్లాతో పాటు ఆయన సోదరుడు భారీ పేలుళ్లలో మృతి చెందారని కాబూల్‌ పోలీసు అధికార ప్రతినిధి ఖాలిద్‌ జర్డాన్‌ చెప్పారు. వీరితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారని ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికార ప్రతినిధి బిలాల్‌ కరిమి కూడా రహిముల్లా మృతిని ఖరారు చేశారు. పిరికిపందలైన శత్రువులు దొంగదెబ్బ తీశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మాత్రం ఆయన ఇవ్వలేదు.

రహిముల్లా మృతి చెందిన కొన్ని గంటల తర్వాత ఐసిస్‌ స్పందించింది. రహీముల్లా హక్కానీ ఆయన కార్యాలయంలో తమ మానవబాంబర్‌ తనను తాను కాల్చుకుని రహీముల్లాను కూడా చంపాడని పేర్కొంది. తాలిబన్‌ వర్గాల సమాచారం ప్రకారం ఆయనకు ఎలాంటి అధికార హోదా లేది, అయితే తమ గ్రూపు సభ్యులకు గత కొన్ని సంవత్సరాల నుంచి శిక్షణ ఇస్తున్నారని తెలిపింది. తాలిబన్‌ అధికారులు సోషల్‌ మీడియ ద్వారా తమ సంతాపం తెలియజేశారు.

ఇక రహిముల్లా హక్కానీ విషయానికి ఆయన ఐసీస్‌కు వ్యతిరేకంగా ఆగ్రహంతో ప్రసంగాలు చేసేవారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐసిస్‌లు పెద్ద ఎత్తున దాడులు చేయడం ప్రారంభించారు. ఇటీవల కాలంలో ఆయన బాలికల విద్యకు అనుకూలంగా పలు బహిరంగసభల్లో ప్రసంగించారు. షరియాలో ఎక్కడా ముస్లిం బాలికలు విద్యను అభ్యసించరాదని లేదని ఆయన గత మేనెలలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గత ఏడాది తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికలు, మహిళలపై పలు కఠిన నిర్బంధాలు విధించడం మొదలుపెట్టారు.

Exit mobile version