Site icon Prime9

AP Government : ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట.. సిట్ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్

supreme court judgement on ap government sit

supreme court judgement on ap government sit

AP Government : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జగన్ సర్కారు ఏర్పాటు చేసిన “సిట్” (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) పై సుప్రీం కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ దర్యాప్తు జరిపేందుకు ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు సుప్రీం తీర్పుతో లైన్ క్లియర్ అయ్యిందని చెప్పవచ్చు. కాగా అంతకు ముందు ఏపీలో గత ప్రభుత్వ నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం విధితమే. సిట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన ఏపీ హైకోర్టు సిట్‌‌పై ‘స్టే’ ఇచ్చింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

ఇప్పటికే వాదనలు విన్న జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ రోజు తీర్పు ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం తీర్పు వెలువరించింది. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదని.. సీబీఐ , ఈడీ దర్యాప్తునకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదని పేర్కొంది. సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదని, జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదని సుప్రీం బెంచ్‌ ప్రస్తావించింది. ఇక, ఏపీ హైకోర్టును తీర్పును పక్కనపెడుతున్నట్లు జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

ఏ ఏ అంశాలపై దర్యాప్తు అంటే (AP Government)..

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలపై సిట్ దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం పిటీషన్‌పై విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృధా, దురుద్దేశం తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి అని ప్రశ్నించింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వందశాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని విచారణ సమయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో జగన్ సర్కారు సిట్ దర్యాప్తు విషయంలో ఊరట లభించినట్లు అయ్యింది.

Exit mobile version