Superstar Krishna Statue: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు సినీ హీరో, పద్మ భూషణ్ కమల్ హాసన్.. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు.. ఇక, సూపర్ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ఆనందం వ్యక్తం చేశారు దేవినేని ఆవినాష్.. పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం వైఎస్ జగన్ కు కృష్ణ కుటుంబ సభ్యులు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) విజయవాడలో సందడి చేశారు. కమల్ హాసన్‌ను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఇక ఇదే కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna), మహేష్ బాబు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి వేదినేని అవినాష్ సారథ్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఆహ్వానం మేరకే కమల్ హాసన్ వెళ్లి సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కమల్ హాసన్ ప్రస్తుతం ‘భారతీయుడు 2’ షూటింగ్ నిమిత్తం విజయవాడలోనే ఉన్నారు. దీంతో దేవినేని అవినాష్, ఘట్టమనేని అభిమానుల కోరిక మేరకు కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అయితే, విగ్రహావిష్కరణ అనంతరం కమల్ హాసన్ మీడియాతో మాట్లాడలేదు. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణ అని, అయన వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో, ఇటు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ కృష్ణ పేరు నిలబెడుతున్నారని కొనియాడారు. విజయవాడ వచ్చిన కమల్ హాసన్.. పెద్దాయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు.
ఇదిలా ఉంటే, గతేడాది నవంబర్ 15న కృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన సొంతూరు గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం బుర్రిపాలెం గ్రామంలో ఈ ఏడాది ఆగస్టులో కాంస్య విగ్రహం నెలకొల్పారు. కృష్ణ జ్ఞాపకార్థం ఆయన అభిమానులు, గ్రామస్థులు ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కృష్ణ కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని, అల్లుడు సుధీర్ బాబు, సోదరుడు ఆదిశేషగిరిరావు, ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ‘అగ్నిపర్వతం’ సినిమాలో జమదగ్ని పాత్ర రూపంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. అచ్చం అలాంటి విగ్రహాన్నే ఇప్పుడు విజయవాడలోనూ ఆవిష్కరించారు.
తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు దేవినేని అవినాష్.. తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణ అని కొనియాడారు.. అయన వారసత్వంతో ఇండస్ట్రీ లోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో, ఇటు సేవా కార్యక్రమాల్లో ముందుంటు.. కృష్ణ పేరు నిలబెడుతున్నారని పేర్కొన్నారు.