Site icon Prime9

Mahabalipuram: పర్యాటకులను కట్టిపడేసే రాతిశిల్పాలు.. బీచ్ రిసార్టులు ఇవీ మహాబలిపురం ప్రత్యేకత

Tamil Nadu: తమిళనాడులోని పర్యాటక ప్రదేశాలు అద్బుతమైన శిల్పసంపదకు, ప్రాచీన సంస్కృతికి ఆనవాళ్లుగా వుంటాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలో వున్న మహాబలిపురం కూడ ఈ జాబితాలోకి వస్తుంది.పల్లవ రాజ్యం యొక్క ఏడవ మరియు పదవ శతాబ్దాల మధ్య ఇది ప్రముఖ ఓడరేవుగా పేరు పొందింది. సరుగుడు చెట్లతో అందమైన తెల్లని ఇసుక బీచ్‌లతో అద్భుతమైన ప్రదేశమైన మహాబలిపురానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వెడతారు..

మామల్లపురం మహాబలిపురం పూర్వపు పేరు. పల్లవులు క్రీ.శ. 650 నుండి 750 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. బ్రిటిష్ వారు 1827లో ప్రస్తుత మహాబలిపురం నగరానికి పునాది వేశారు.మహాబలిపురం అద్భుతమైన దేవాలయాలు, రాతి గుహలకు నిలయం. ఈ ప్రదేశాన్ని ఓపెన్ మ్యూజియం అంటారు. రాళ్లతో చెక్కబడిన ఆలయాలు కొన్ని ఉన్నాయి. మండపాలు, గోపురాలు, లైట్ హౌస్, బిగ్ రాక్, పాండవుల రధా లను తప్పకుండా చూడాలి. ఇక్కడ ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా చూడవలసింది సుందరమైన సీషోర్ టెంపుల్. సముద్రం ఒడ్డున అందమైన గుడి ఇది. దీనిని 7వ శతాబ్దంలో రాజసింహాన్ అని కూడా పిలిచే రెండవ నరసింహవర్మచే నిర్మించబడింది. ఇవికాకుండా క్రొకోడైల్ బ్యాంక్ మరియు బీచ్ రిసార్ట్‌లు ఉన్నాయి. ఇక్కడ గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఇక్కడ బీచ్ తీరం వెంబడి దొరికే రకరకాల వేడి వేడి సీఫుడ్ అత్యంత రుచికరంగా ఉంటుంది. దక్షిణభారతదేశపు భోజన హోటళ్లు వున్నాయి. దీనికి దగ్గర్లోనే ఎంజీఎం, వీజీపీ గోల్డెన్ బీచ్, మాయాజల్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంప్లెక్స్, చోళమండలం కళాకారుల గ్రామాలు కూడా చూడదగ్గ ప్రదేశాలే.

అక్టోబరు, నవంబర్, డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెలలు మహాబలిపురం వెళ్ళడానికి ఉత్తమమైనవి. మహాబలిపురం వెళ్ళటానికి చెన్నై కోయంబేడునుంచి బస్సులు ఉన్నాయి. అక్కడినుంచి మహాబలిపురానికి ఒక గంటన్నర రెండు గంటల్లో చేరుకోవచ్చు. మహాబలిపురంలో చూడదగ్గ ప్రదేశాలన్ని చుట్టుపక్కల అరకిలోమీటర్ దూరంలోనే వుంటాయి రూ. 300 మరియు 350 రుసుముతో, ప్రయాణికులు మహాబలిపురంలో మోటార్‌బైక్‌లను కూడా అద్దెకు తీసుకోవచ్చు.

Exit mobile version