Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ బెన్‌ఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పోలీసులు అతడికి సీపీఆర్ చేసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. మూడు వారాలుగా శ్రీతేజ్ విషమ పరిస్థితిలో కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా అతడు కోమాలోకి వెళ్లినట్టు ఇటీవల వైద్యులు పేర్కొన్నారు. అయితే శుక్రవారం కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని, బాడీ కదలికలు వచ్చాయని తెలిపారు. మొన్నటి వరకు సీరియస్ కండీషన్‌లో ఉన్న శ్రీతేజ్ ప్రస్తుతం కాళ్లు, చేతులు కదిలిస్తున్నాడని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఇప్పటికి వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, ఫీటింగ్ తీసుకోగలుకుతున్నట్టు పేర్కొన్నారు. కాగా ఇదే సంఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి కన్నుమూసింది. దీంతో ఈ ఘటనపై మృతురాలి భర్త ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంధ్య థియేటర్ ఓనర్, మేనేజర్‌తో పాటు హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. ఆ వెంటనే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించగా.. గతవారం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఆ మరుసటి రోజే బెయిల్‌పై బన్నీ బయటకు వచ్చాడు.