Site icon Prime9

Sri Lanka: శ్రీలంక ప్రజలపై మరో పిడుగు.. భారీగా పెరిగిన విద్యుత్ చార్జీలు

Sri Lanka: శ్రీలంక ప్రజల కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. పెట్రోల్‌ కొరత, ఆహార కొరత, విద్యుత్‌ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు తాజాగా శ్రీలంక ప్రజల నెత్తిన కరెంటు చార్జీలు పిడుగు పడింది. సిలోన్‌ ఎలక్ర్టిసిటి బోర్డు విద్యుత్‌ టారిఫ్‌ను ఏకంగా 264 శాతం పెంచేసింది. అయితే టారిఫ్‌ కూడా విద్యుత్‌ ఎక్కువ వినియోగించే వారిపై తక్కువ భారం అంటే పేదలు, మధ్య తరగతి ప్రజలు వినియోగించే విద్యుత్‌ పై భారీగా టారిఫ్‌ పెంచేశారు. భారీ నష్టాల్లో కూరుకుపోయిన సిలోన్‌ ఎలక్ర్టిసిటి బోర్డుకు విద్యుత్‌ నియంత్రణా సంస్థ భారీగా చార్జీలు పెంచడానికి అనుమతించింది. గత తొమ్మిదేళ్లలోఎన్నడూ లేని విధంగా ధరలు పెంచేసింది సీఈబీ, కాగా సిలోన్‌ ఎలక్ర్టిసిటి బోర్డు నష్టాలు ఏకంగా 616 మిలియన్‌ డాలర్ల చేరాయి. దీంతో నష్టాల నుంచి బయటపడ్డానికి చార్జీలను పెంచడానికి అనుమతించింది సిలోన్‌ విద్యుత్‌ నియంత్రణాసంస్థ.

ఇదిలా ఉండగా సీఈబీ ఏకంగా 800 శాతం టారిఫ్‌ పెంచడానికి అనుమతి కోరగా, నియంత్రణా సంస్థ మాత్రం 264 శాతం పెంచడానికి అనుమతించిందని అధికారులు తెలిపారు. 80 లక్షల మంది గృహస్తుల్లో మూడో వంతు మంది ప్రజలు 90 కిలోవాట్‌ల కంటే తక్కువ విద్యుత్‌ వినియోగిస్తున్నారు. వారి మీద చార్జీల భారం అధికంగా పడే అవకాశం ఉంది. అయితే విద్యుత్‌ ఎక్కువగా వినియోగించే వినయోగదారులు టారిఫ్‌ 80 శాతం మాత్రమే పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం తక్కువ విద్యుత్‌ వినియోగించే వినియోగదారులు యూనిట్‌కు రెండున్నర రూపాయలు చెల్లిస్తుండగా, ఇక నుంచి 8 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా విద్యుత్‌ అధికంగా వినియోగించే అధికారులు యూనిట్‌కు 45 రూపాయలు చెల్లిస్తుండగా, ఇక నుంచి 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా శ్రీలంక భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశీ నిల్వలు కరిగిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువులు ఆహారం, ఇంధనం, మందులను దిగుమతి చేసుకోలేక ఇబ్బందులు పడుతోంది. దేశంలో ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. కరెంటు కోతలకు అంతే లేకుండా పోయింది. థర్మల్‌ జనరేటర్లకు ఆయిల్‌ కొనుగోలు చేయలేకపోతోంది. కాగా శ్రీలంక విదేశీ రుణాలు 51 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ రుణాలు చెల్లించలేకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లోనే శ్రీలంక ప్రభుత్వాన్ని డిఫాల్ట్‌గా ప్రకటించాయి. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి రుణం కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఐఎంఎఫ్‌తో చర్చలు కొనసాగుతున్నాయి. ఐఎంఎఫ్‌ దయతలచి రుణం ఇస్తే తప్ప శ్రీలంకకు ప్రస్తుతం మోక్షం కనిపించడం లేదు.

Exit mobile version