Signature Bank: పెద్ద ఎత్తున డిపాజిటర్లు నిధులను ఉపసంహరించుకోవడంతో దివాలా తీసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఉదంతం ఇంకా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అది మరువక ముందే అమెరికాలో మరో బ్యాంక్ దివాలా తీసింది.
క్రిప్టో పరిశ్రమతో ఎక్కువగా సంబంధాలున్న సిగ్నేచర్ బ్యాంక్ ను మూసివేస్తున్నట్లు అక్కడి నియంత్రణ సంస్థలు ప్రకటించాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అమెరికాలో కీలక బ్యాంకులు మూతపడడంతో బ్యాంకింగ్ రంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
సిగ్నేచర్ బ్యాంకును ‘ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్’(ఎఫ్‌డీఐసీ) తన నియంత్రణలోకి తీసుకుంది. గత ఏడాది ముగిసే నాటికి సిగ్నేచర్ బ్యాంక్ కు 110.36 బిలియన్ డాలర్ల ఆస్తులు, 88.59 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి.
అయితే, ప్రస్తుతం బ్యాంకు డిపాజిటర్లు తమ నిధులను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంటుందని ఎఫ్‌డీఐసీ పేర్కొంది. అందుకోసం తాత్కాలికంగా ఓ బ్రిడ్జ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశామని తెలిపింది.
దీని ద్వారా సిగ్నేచర్ కస్టమర్లు, డిపాజిటర్లు తమ నిధులకు యాక్సెస్ పొందొచ్చని పేర్కొంది. ఈ తాత్కాలిక బ్యాంకుకు గ్రెగ్ కార్మికేల్ అనే బ్యాంకింగ్ నిపుణుడిని సీఈఓగా నియమించింది.
న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ వాణిజ్య బ్యాంకే ఈ సిగ్నేచర్ బ్యాంక్. స్థిరాస్తి, డిజిటల్ అసెట్స్ బ్యాంకింగ్ సహా మొత్తం 9 విభాగాల్లో ఈ బ్యాంకు సేవలందిస్తోంది.
గత ఏడాది సెప్టెంబరు నాటికి ఈ బ్యాంకు డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో రంగం నుంచి వచ్చినవే.
అయితే, తమ క్రిప్టో ఆధారిత డిపాజిట్లను త్వరలోనే 8 బిలియన్ డాలర్లకు కుదించుకుంటామని డిసెంబరులో సిగ్నేచర్ బ్యాంకు ప్రకటించింది.
మరోవైపు తమ సీఈఓ జోసెఫ్ డీపావోలో సీనియర్ సలహాదారుగా మారనున్నారని ఫిబ్రవరిలోనే తెలిపింది. ఆయన స్థానంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎరిక్ హొవెల్ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది.
ఎస్‌వీబీ, సిగ్నేచర్ బ్యాంక్ పతనానికి కారణమైన వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
అలాగే డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయని కూడా హామీ ఇచ్చారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారాలు, పన్ను చెల్లింపుదారులు సహా మొత్తం ఆర్థిక వ్యవస్థను రక్షించేలా నియంత్రణ సంస్థలు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాయిని బైడెన్ తెలిపారు.
మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికే సిగ్నేచర్ బ్యాంకుపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది.
తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా చర్యలు తీసుకున్నామని ఫెడరల్ రిజర్వ్ పేర్కొంది.
మరోవైపు బ్యాంకులు ద్రవ్యలభ్యత సమస్యలు ఎదుర్కోకుండా 25 మిలియన్ డాలర్లతో తాత్కాలిక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఫెడ్ ప్రకటించింది.
అలాగే సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లో డిపాజిట్‌దారులు తమ నిధులను ఉపసంహరించుకునేందుకు సోమవారం నుంచి అనుమతి ఉంటుందని తెలిపింది.