Sarath Babu : టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ వస్తున్నారు. తాజాగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం (ఏప్రిల్ 21) నాడు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ (AIG) ఆస్పత్రిలో అత్యవసర చికిత్స నిమిత్తం ఐసీయూలో అడ్మిట్ చేయించారు. మెరుగైన చికిత్స అందించడంతో ప్రస్తుతం శరత్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. అలాగే ఆయనని ఐసీయూ నుంచి సాధారణ గదికి తరలించి అవసరమైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రేక్షకులు, ప్రముఖులు శరత్ బాబు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. శరత్ బాబు హాస్పిటల్‌లో మళ్లీ అనారోగ్య సమస్యతో చేరారని తెలియయడంతో అభిమానులు ఒకింత టెన్షన్ పడ్డప్పటికీ.. ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించారాయన. దాదాపు 220 కి పైగా సినిమాల్లో నటించి తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేశారు శరత్ బాబు. ఇప్పటికీ ఆయన అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘వకీల్ సాబ్’ సినిమాలో కూడా ఓ పాత్రలో కనిపించారు శరత్ బాబు. నిజానికి సినిమాల్లో రాక ముందు ఆయన పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకున్నారు. అయితే కంటి సమస్య ఉండటంతో ఆ కోరిక నెరవేరలేదు. తండ్రి వ్యాపారాన్ని చూసుకోమని చెప్పినప్పటికీ ఆయన సినీ రంగం వైపు ఆకర్షితుడయ్యారు. తల్లి సపోర్ట్‌తో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్థానాన్ని సొంతం చేసుకున్నారాయన.
శరత్ బాబు ఆంధ్రప్రదేశ్ ఆముదాలవలసలో జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. 1973 లో విడుదల అయిన ‘రామరాజ్యం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా పలు పురస్కారాలను కూడా అందుకున్నారు. ఆయన నటనకు గానూ 1981, 1988, 1989 సంవత్సరాలలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. మొదటిసారి ‘సీతాకోక చిలుక’ సినిమాకు అవార్డును అందుకున్నారు. తర్వాత ‘ఓ భార్య కథ’, ‘నీరాజనం’ సినిమాలకు గానూ పలు అవార్డులు అందుకున్నారు. అంతేకాదు పలు టెలివిజన్ షోస్ లో కూడా శరత్ బాబు నటించారు.