New York: అమెరికాలోని న్యూయార్క్‌లో శుక్రవారం జరిగిన ఓ సాహిత్య కార్యక్రమంలో రచయిత సల్మాన్ రష్దీ మెడ, పొత్తికడుపుపై ఒక వ్యక్తి కత్తితో దాడిచేసారు. 75 ఏళ్ల రష్దీ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. అతను ఒక కన్ను కోల్పోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. అతనిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అయితే దాడికి కారణాలు తెలియలేదు.
న్యూయార్క్ పోలీసులు అతని పై దాడి చేసిన వ్యక్తిని న్యూజెర్సీకి చెందిన హదీ మాటర్ (24)గా గుర్తించారు. దాడి వెనుక ఉద్దేశ్యం అస్పష్టంగా ఉంది అని అధికారులు తెలిపారు. అతను “షియా తీవ్రవాదని తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో దాదాపు 2,500 మంది ఉన్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఈ దాడిని “భయంకరమైనది” మరియు ఖండించదగినదని అభివర్ణించారు.
భారతీయ సంతతికి చెందిన రష్దీ బ్రిటీష్ పౌరుడు. అతను గత 20 సంవత్సరాలుగా యుఎస్‌లో నివసిస్తున్నారు. సల్మాన్ రష్దీ 1988లో తన పుస్తకం ది సాటానిక్ వెర్సెస్‌పై పలు బెదిరింపులను ఎదుర్కొన్నారు. ఈ నవలను కొందరు మతపెద్దలు ప్రవక్త మహమ్మద్‌ను అగౌరవపరిచినట్లుగా భావించారు. అతని హత్యకు పిలుపునిచ్చిన ఇరాన్ నాయకుడు అయతుల్లా రుహోల్లా ఖొమేనీ అతని తలకు బహుమతిని ప్రకటించాడు. దీనితో రష్దీదాదాపు ఒక దశాబ్దం పాటు యునైటెడ్ కింగ్‌డమ్‌లో పోలీసు రక్షణలో గడిపాడు.