Russian President Putin: ప్రపంచం మొత్తం అధిక జనాభాతో సతమతమవుతోంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తమ దేశం తల్లులను ఎక్కువ మంది పిల్లలను కనండి అని ప్రోత్సహిస్తున్నారు. రష్యాలో క్రమంగా శిశు జననాల రేటు తగ్గిపోవడంతో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు మధర్ హీరోయిన్ అవార్డుపై ఈ నెల 16న సమీక్ష నిర్వహించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారీగా జనాభా తగ్గిపోవడంతో 1944లో సోవియట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ అప్పుడు ఎక్కువ మంది పిల్లలను కన్న మహిళలను మధర్ హీరోయిన్ టైటిల్ ఇచ్చి గౌరవించే వారు. 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత ఈ అవార్డులను నిలిపివేశారు.
ప్రస్తుతం మరోసారి మధర్ హీరోయిన్ టైటిల్‌ను పునరుద్దరించాలని పుతిన్ నిర్ణయించారు. కనీసం పది మంది లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలను కన్నవారికి మధర్ హీరోయిన్ టైటిల్‌తో పాటు మిలియన్ రూబుల్ నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు. గత సోమవారం పుతిన్ ఈ డిక్రీ పై సంతకం కూడా చేశారు. అయితే ఈ డబ్బు 10వ పాప లేదా బాబు పుట్టిన ఏడాది తర్వాత మాత్రమే ఇస్తారు. మిలియన్ రూబుల్స్ అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 13 లక్షల 12వేల రూపాయలు మధర్ హీరోయిన్‌కు అందజేస్తారు.
గత దశాబ్దకాలం నుంచి రష్యాలో జనాభా గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో జనాబా 146 మిలియన్‌లుగా తేలింది. 2021 నుంచి జనాభా క్రమంగా తగ్గముఖం పడుతూ వచ్చింది. 2020లో కరోనా వైరస్ వల్ల ఏకంగా మూడు రెట్లు తగ్గింది. తిరిగి జనాభా రేటును పెంచుకోవడానికి రష్యన్ ప్రభుత్వం నగదు బహుమతులతో పాటు మథర్ హీరోయిన్ టైటిల్‌తో గౌరవించాలని నిర్ణయించారు.