Site icon Prime9

Rottela Panduga: నేటి నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ

Nellore: మతసామరస్యానికి ప్రతీకగా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ ఇవాళ్టి నుంచి 13వ తేదీ వరకు జరగనుంది. రెండేళ్ల తర్వాత పండుగ జరుగుతుండటంతో దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. అందుకు తగినట్లుగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. దీంతో దర్గా ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేసి కోరికల రొట్టెలను పట్టుకొంటున్నారు. మతసామరస్యానికి ప్రతీకగా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ రేపటినుంచి 13వ తేదీ వరకు జరగనుంది. రెండేళ్ల తర్వాత పండుగ జరుగుతుండటంతో దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. అందుకు తగినట్లుగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. దీంతో దర్గా ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేసి కోరికల రొట్టెలను పట్టుకొంటున్నారు.

మ‌త‌ సామ‌ర‌స్యానికి ప్రతీకగా నిలుస్తుండటంతో దేశ‌, విదేశాల నుంచి భక్తులు వచ్చి కోరిన కోర్కెల రొట్టెలు మార్చుకోవ‌డం అనాది నుంచి ఆన‌వాయితీగా వ‌స్తోంది. దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం మహ్మద్ ప్రవక్త అనుచరులు 12 మంది భక్తి భావాలను ప్రజలకు బోధిస్తూ, నెల్లూరు ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో జరిగిన పవిత్ర యుద్ధంలో భాగంగా ఆ పన్నెండు మంది వీర మరణం పొందారు. జిల్లాలోని కొడవలూరు మండలం గండవరంలో వీరి తలలు తెగిపడగా, అక్కడి నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు చెరువు ఒడ్డుకు గుర్రాలు ఈ 12 మంది మొండాలను తీసుకువ‌చ్చి వేశాయ‌ని చ‌రిత్ర చెబుతోంది. ఆ మొండేలను నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద సమాధి చేశారు. దీంతో పవిత్ర యుద్ధంలో వీరమరణం పొందిన వీరికి బారాషహీద్ లుగా పేరు వచ్చింది.

ఆర్కాట్ న‌వాబుల ప‌రిపాల‌న స‌మ‌యంలో స్వర్ణాల చెరువులో ర‌జ‌కులు దుస్తులు ఉతికేవారు. ఓ రోజు ర‌జ‌క దంప‌తులు చెరువులో దుస్తుల‌ను ఉతికే స‌రికి రాత్రి అయింది. దీంతో ఆ దంప‌తులు అక్కడే నిద్ర చేశారు. ర‌జ‌కుని భార్యకు అక్కడ స‌మాధులైన బారాష‌హీదులు క‌ల‌లో వ‌చ్చి ఆర్కాట్‌ న‌వాబు భార్య అనారోగ్యంతో బాధ‌ప‌డుతుంద‌ని, స‌మాధుల ప‌క్కన ఉన్న మ‌ట్టిని తీసుకెళ్లి ఆమె నుదుటిపై రాస్తే కోలుకుంటుంద‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని ఆమె త‌న భర్తకి చెప్పగా అత‌ను కొట్టిపారేశాడు. ఆ తెల్లారి దంప‌తులు ఇద్దరూ గ్రామంలోకి వెళ్తుండ‌గా, ఆర్కాట్ న‌వాబు భార్య అనారోగ్యంతో ఉంద‌ని, ఆమెకు స‌రైన వైద్యం చేస్తే కోరిన కోర్కెలు తీరుస్తామ‌ని ఆర్కాట్ న‌వాబు దండోరా వేయించ‌డాన్ని ర‌జ‌కుడు గ‌మ‌నించాడు. త‌న భార్య క‌ల విష‌యాన్ని న‌వాబు ఆస్దానంలోని కొందరికి తెలిపారు. దాంతో రాజు త‌న అనుచ‌రుల‌ను చెరువు వ‌ద్దకి పంపి మ‌ట్టి తెప్పించి భార్య నుదిటి పై పూయడంతో ఆమె ఆరోగ్యం కుదుట ప‌డింది. రాజు సంతోషం ప‌ట్టలేక త‌న భార్యతో క‌లిసి స్వర్ణాల చెరువు స‌మీపంలోని స‌మాధులల వ‌ద్దకి వ‌చ్చి బారాష‌హీద్ ల‌కు ప్రార్ధన‌లు జ‌రిపారు. అనంతరం త‌మ‌తో తెచ్చుకున్న రొట్టెల‌లో కొన్ని తిని మిగిలిన వాటిని అక్కడి వారికి పంచారు. అలా రొట్టెల మార్పిడి జ‌రుగుతూ క్రమంగా రొట్టెల పండుగ‌గా మారింది.

మొహ‌రం త‌ర్వాత మూడోరోజు ఒక్కరోజే ఇక్కడ రొట్టెల పండుగ జ‌రిగేది. రాను రాను దీనికి ప్రాచుర్యం రావ‌డంతో మొహ‌ర్రం రోజు నుంచి మూడు రోజులు పండుగ జ‌రిపేవారు. అది కాస్త ఐదురోజుల‌కు మారింది. వివిధ ర‌కాల రొట్టెలు ఇక్కడ మార్చుకుంటారు. విద్య, వివాహం, సంతానం, ఆరోగ్యం, ధ‌న‌, గృహ సంబంధిత సమస్యలకు రొట్టెలు వ‌ద‌ల‌డం, ప‌ట్టుకోవ‌డం జరుగుతుంది. ముందుగా ఈ ఏడాది ఓ కోరిక కోరుకుని రొట్టె ప‌ట్టుకునే వారు ఆ కోరిక తీరాక ఆ రొట్టెను తిరిగి వ‌ద‌లాలి. అలా ఈ ఏడాది తీసుకున్న రొట్టెను మ‌రో ఏడాది కోరిక తీరాక వ‌దులుతారు. ముందుగా బారాష‌హీదుల‌ను ద‌ర్శించుకున్న త‌ర్వాత స్వర్ణాల చెరువులోకి వెళ్లి మోకాలి లోతు నీళ్లల్లో త‌ల‌పై నీళ్లు చ‌ల్లుకుని రొట్టెలు మార్చుకోవ‌డం ఆనవాయితీగా వ‌స్తుంది.

క‌రోనా ప్రభావంతో రెండేళ్లుగా రొట్టెల పండుగ జ‌రుగ‌లేదు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి జ‌రుగుతున్న ఈ రొట్టెల పండుగ‌ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రేపటి నుంచి 13వ తేదీ వ‌ర‌కు రొట్టెల పండుగ జ‌రుగుతుంది. అందులో 9న ష‌హాద‌త్ సొంద‌ల్ మాలీ, 10వ తేదీ అర్థరాత్రి గంధ మ‌హోత్సవం జ‌రుగుతుంది. 11న అధికారికంగా రొట్టెలు మార్చుకుంటారు. 12న త‌హ‌లీల్ ఫాతిహా పేరుతో వేడుక‌లు నిర్వహిస్తారు. 13వ తేదీన ముగింపు కార్యక్రమం ఉంటుంది. దీంతో ఈ ఏడాది రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి నేత్రత్వంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వ‌చ్చే భ‌క్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకోవ‌డంతో పాటు ఆహ్లాద‌భ‌రిత వాతావ‌ర‌ణంలో సేద‌తీరుతారు. నెల్లూరు కార్పొరేష‌న్, పోలీసు, వ‌క్ఫ్ బోర్డు స‌మ‌న్వయంతో క‌మిటీ స‌భ్యులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Exit mobile version