Rock Python : ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఎంతో ముఖ్యమైందే. ఒక జీవి మనుగడ మరొక జీవితో ముడిపడి ఉందనేది వాస్తవం.
అయితే మారుతున్న కాలానుగుణంగా ఎన్నో జీవులు కాలంతో పాటే కనుమరుగయ్యి పోతున్నాయి.
వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదాలు .. ఇతర కారణాల వల్ల ఎన్నో జీవులు అంతరించిపోతున్నాయి.
భారత దేశంలో ఇప్పటికే ఎన్నో జీవులు ఇలా కనబడకుండా పోతున్నాయి.
పక్షులు, క్రూర మృగాలు ఇలా ఎన్నో జంతువులు భూమిపై నుంచి గుడ్ బై చెప్పేసాయి. ఇ
ప్పుడు తాజాగా ఈ జాబితా లోకే అరుదైన ఇండియన్ రాక్ పైథాన్‌లు కూడా చేరే ప్రమాదం కనిపిస్తుంది.
రాక్ పైథాన్ మనుగడ..
రాక్ పైథాన్ లు అరుదైన సరీసృపాలు. ఇవి విషపూరితం కావని చెట్లపై మాత్రమే ఉంటాయని అంతా భావిస్తుంటారు. ఇండియన్ రాక్ పైథాన్‌గా పిలిచే కొండచిలువల శాస్త్రీయ నామం పైథాన్ మోలురూస్.
అయితే ఇవి నీటిలో సైతం వేగంగా ఈదగలవని.. ఎక్కువ సమయం ఇవి నీటిలోనే గడుపుతుంటాయని జంతుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు.
ఈ కొండచిలువలు చిత్తడి నేలలు, గడ్డి భూములు, రాతి పర్వతాలు, నదీ లోయల్లో ఇవి నివసిస్తుంటాయి.
పాడుబడిన క్షీరదాల బొరియలు, చెట్లు, మడ అడవుల్లో దాక్కుంటాయి. కోళ్లు, పక్షులు, ఎలుకలు, అడపాదడపా ఇతర జంతువులను సైతం ఆహారంగా తీసుకుంటాయి.
అలాంటి కొండచిలువలు ఇప్పుడు కొల్లేరుకు అతిథులగా వచ్చాయి.
ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 9 మండలాల పరిధిలో.. 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది.
ఇక్కడ 2.80 లక్షల ఎకరాల్లో చేపల చెరువులు సాగవుతున్నాయి. ఈ చెరువుల చెంతకు సుమారు మూడు దశాబ్దాల క్రితం అరణ్య ప్రాంతాల నుంచి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి వాగుల ద్వారా కొండచిలువలు వలస రావటం మొదలైంది.
పొదలు, చేపల చెరువుల గట్లపై ఆవాసాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడే తిష్టవేశాయి.
కొండ చిలువల సంచారం ఎక్కువగా ఏలూరు జిల్లా.. కలిదిండి, కైకలూరు మండలాల్లో కనిపిస్తోంది.
రాక్ పైథాన్ గురించి ఆసక్తికర వివరాలు..
ఇవి 12 అడుగుల పొడవు, 52 కేజీల బరువు పెరుగుతాయి. వీటి జీవిత కాలం గరిష్టంగా 21 సంవత్సరాలు. ఇవి పుట్టిన తర్వాత తక్కువ కాలంలోనే పెద్దవి అవుతాయి. ఏడాది వయసు దాటిన తర్వాత నుంచి జత కడుతుంటాయి.
సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇవి జత కట్టి 2 నుంచి 3 నెలల్లో గర్భం దాలుస్తాయి. అనంతరం మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో రోజుకు 20 నుంచి 30 గుడ్ల చొప్పున కనీసం 100 గుడ్ల వరకు పెడతాయి.
నాలుగు నెలల పాటు గుడ్లను పొదుగుతాయి. పొదిగిన గుడ్లలో 80 శాతానికి పైగా పిల్లలు అవుతాయి. పుట్టిన పిల్లలు 18–24 అంగుళాల వరకు పొడవు ఉంటాయి. అయితే, పుట్టిన వాటిలో 25 శాతం పిల్లల్ని వరకు తల్లే తినేయ్యగా.. ఆహారం అందక ఇంకొన్ని చనిపోతాయి.
చివరకు 10–15 పిల్లలు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది.
కొండచిలువలు క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలను తిని జీవిస్తాయి.
ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత వారం పాటు ఏమీ తినకుండా ఉండగలవు.
ప్రపంచంలో అతి పెద్ద పాముల్లో ఇది కూడా ఒకటి.
అయితే కొండచిలువలు విషసర్పాలు కానప్పటికీ వీటి ఆకారం భారీగా ఉండటంతో ప్రజలు భయపడి చంపేస్తున్నారు.
కొద్ది ఘటనల్లో మాత్రమే అటవీ శాఖ అధికారులు వీటిని రక్షించి కాపాడగలుగుతున్నారు.
ఇటీవల ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) హాని కలిగే జాతుల జాబితా (రెడ్ లిస్ట్)లో వీటిని చేర్చింది. ఐయూసీఎన్ సంస్థ దాదాపు 40 శాతం రాక్ పైథాన్ జాతి అంతరించిందని తాజాగా వెల్లడించింది.
కొల్లేరు గ్రామాల్లో ఏటా 30 నుంచి 40 కొండచిలువలు ప్రజల చేతిలో హతమవుతున్నట్టు అంచనా వేసింది. అటవీ శాఖ కొండచిలువలను కూడా షెడ్యూల్–1లో చేర్చింది. వీటిని చంపటం నేరమని ప్రకటించింది. అందువల్ల ఎక్కడైనా కొండచిలువలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/