Site icon Prime9

Raghava Lawrence : మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్.. 150 మంది పిల్లల్ని దత్తత

raghava-lawrence post about adopting 150 children goes viral

raghava-lawrence post about adopting 150 children goes viral

Raghava Lawrence : రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ మాస్టర్ గా, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా సుపరిచితుడే. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు తన వంతు సాయం చేస్తూ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచో లారెన్స్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎంతో మంది పిల్లలను దత్తత తీసుకొని వారి చదువుకు కావాల్సినవి అన్ని సమకూరుస్తున్నారు. అదే విధంగా ఒక అనాధాశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

కాగా లారెన్స్ హీరోగా  ముని, కాంచన, గంగ, పలు చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇప్పుడే అదే జోష్ తో రుద్రుడు సినిమాతో రాబోతున్నాడు. ఈ నెల 14న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. కతిరేశన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ్ లో మూవీ రిలీజ్ కాబోతుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. తాజాగా రుద్రుడు ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా లారెన్స్ కొంత మంది అనాథ పిల్లలను స్టేజిపైకి తీసుకొచ్చి వారితో ఫోటోని దిగాడు.

ఇప్పుడు తాజాగా ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మరో 150 మంది పిల్లలను దత్తత తీసుకొని వారికి, వారి చదువుకు కావాల్సినవి అన్ని సమకూరుస్తున్నాను. రుద్రుడు వేదికపై నుంచి ఈ విషయాన్ని మీ అందరికి తెలియచేయడం ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలి అని పోస్ట్ చేశారు. దీంతో మరోసారి అందరూ లారెన్స్ ని అభినందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు లారెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన గొప్ప మనసుకు హ్యాట్సాఫ్‌ అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు . కాగా లారెన్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా గతంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో ఒక్కసారి 141 మంది చిన్నారులకు శస్త్రచికిత్స చేయించి వార్తల్లో నిలిచారు. కేవలం నటుడిగానే కాకుండా ఈ విధంగా ప్రజల కోసం ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న లారెన్స్ అని అందరూ అభినందించాలి.

 

 

కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులెవరికైనా గుండెకు శస్త్రచికిత్స చేయించాలన్న, ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు దూరమవుతున్నారని తెలిసినా వెంటనే లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించాలని లారెన్స్ కోరారు. మరో వైపు చంద్రముఖి 2 సినిమాలో కూడా నటిస్తున్నారు. వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Exit mobile version