Prakash Singh Badal : శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ మృతి చెందారు. మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈయన తుదిశ్వాస విడిచారని తెలుస్తుంది. కాగా 95 ఏళ్ల వయసున్న ప్రకాష్ సింగ్ గతంలో 5 సార్లు పంజాబ్ సీఎం గా పని చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా గత వారమే ఆయన మొహాలి ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బాదల్ 94 ఏళ్ల వరకు రాజకీయాల్లో చురుకుగా పని చేయడం గమనార్హం.
అంత్యక్రియలు (Prakash Singh Badal)..
ఈరోజు (బుధవారం) ఉదయం ఆయన భౌతికకాయాన్ని మొహాలి నుంచి బాదల్ గ్రామానికి తరలించనున్నారు. ప్రకాష్ సింగ్ బాదల్ పార్థివ దేహాన్ని చండీగఢ్‌లోని సెక్టార్ 28లోని SAD ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు, అక్కడ ప్రజలు చివరి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత చండీగఢ్ నుంచి బాదల్ గ్రామం వరకు ఆయన అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ప్రముఖ రాజకీయ వేత్త అంత్యక్రియలు ఏప్రిల్ 27 (గురువారం)న నిర్వహించనున్నారు.
జననం, రాజకేయ అరంగేట్రం..
ప్రకాష్ సింగ్ బాదల్ 1927 డిసెంబర్ 8న పంజాబ్‌లోని మాల్వా సమీపంలోని అబుల్ ఖురానా గ్రామంలో జన్మించాడు. అతను జాట్ సిక్కు. అతని తండ్రి రఘురాజ్ సింగ్, తల్లి సుందరి కౌర్. 1959లో అతను సురీందర్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. బాదల్స్‌కు సుఖ్‌బీర్ సింగ్ బాదల్, ప్రణీత్ కౌర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాదల్ భార్య సురీందర్ కౌర్ దీర్ఘకాల అనారోగ్యంతో 2011లో మరణించారు.
ప్రకాష్ సింగ్ బాదల్‌ను పంజాబ్ రాజకీయాల పితామహుడు అని పిలుస్తుంటారు. పంజాబ్ రాజకీయాలలో బాదల్ స్థాపించిన శిరోమణి అకాలీదళ్ పార్టీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లా లంబి అసెంబ్లీ నుంచి 1997 నుంచి వరుసగా 5 ఎన్నికల్లో విజయం సాధించారు. 5 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన 10 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. బాదల్ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా 1970లో తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 1977లో రాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1997లో రాష్ట్ర 28వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బాదల్ 2007లో నాలుగోసారి, 2012లో ఐదోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
ఏడు దశాబ్దాల పాటు సాగిన రాజకీయ జీవితంలో బాదల కేవలం రెండు ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారు. 1967, 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూశారు. జూన్ 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో మిలిటెంట్లను ఏరివేయడానికి సైన్యం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించినప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడు. 2020లో కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనపై ఆయన పార్టీ బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిరసన తెలిపిన రైతుల పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా ప్రకాష్ సింగ్ బాదల్ తన పద్మవిభూషణ్ అవార్డును తిరిగి ఇచ్చారు.
ప్రధాని మోదీ సంతాపం..
బాదల్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పంజాబ్ నాయకుడికి నివాళులర్పించారు. బాదల్ భారత రాజకీయాలలో ఒక గొప్ప వ్యక్తి, గొప్ప రాజనీతిజ్ఞుడు అని ట్వీట్ చేశారు.
ਮੈਨੂੰ ਸਾਡੀਆਂ ਕਈ ਵਾਰਤਾਲਾਪ ਯਾਦ ਹਨ, ਜਿਨ੍ਹਾਂ ਵਿੱਚ ਉਨ੍ਹਾਂ ਦੀ ਸਿਆਣਪ ਹਮੇਸ਼ਾ ਸਾਫ਼ ਨਜ਼ਰ ਆਉਂਦੀ ਸੀ। ਉਨ੍ਹਾਂ ਦੇ ਪਰਿਵਾਰ ਅਤੇ ਅਣਗਿਣਤ ਪ੍ਰਸ਼ੰਸਕਾਂ ਨਾਲ ਹਮਦਰਦੀ। pic.twitter.com/VqqXboIBjS
— Narendra Modi (@narendramodi) April 25, 2023