Balineni Srinivasa Reddy : సీఎం జగన్ పర్యటనలో మంత్రి బాలినేనికి చేదు అనుభవం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటనలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బాలినేనికి అధికారులు ప్రొటోకాల్‌లో ప్రాధాన్యం ఇవ్వలేదు..

  • Written By:
  • Publish Date - April 12, 2023 / 01:13 PM IST

Balineni Srinivasa Reddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటనలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బాలినేనికి అధికారులు ప్రొటోకాల్‌లో ప్రాధాన్యం ఇవ్వలేదు.. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మార్కాపురంలో జరిగే ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొనకుండా తిరిగి వెళ్లిపోయారు. మాజీ మంత్రి బాలినేనితో పాటు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, అనుచరులు వెనుదిరిగారు. కాగా మంత్రి ఆదిమూలపు సురేష్, మార్కాపురం ఎమ్మెల్యే చెప్పినా బాలినేని వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే సీఎంకు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్‌ దగ్గరకు మంత్రులు, ఇతర నేతలు బయల్దేరారు. బాలినేనిని కూడా వెళ్లబోతుండగా.. వాహనం పక్కనపెట్టి నడిచి రావాలని ఆయనకు సూచించారట. దీంతో మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో ముఖ్య నేతగా ఉన్న బాలినేని.. తనకు సీఎం కార్యక్రమంలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. ఆయన కార్యక్రమానికి హాజరు కాకుండానే వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత సీఎంవో నుంచి బాలినేనికి ఫోన్ వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో మాజీ మంత్రి వెనక్కు వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారని సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

కాగా సీఎం జగన్ మర్కాపురంలోని ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. అలానే రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  మోహన్‌ రెడ్డి రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో  జమ చేశారు. ఇక మార్కాపురం నుంచి బయలుదేరి 1.35 గంటలకు సీఎం జగన్ తాడేపల్లికి చేరుకుంటారు.