Site icon Prime9

PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోదీ రాక.. రూ. 2 లక్షల కోట్ల పనులకు శ్రీకారం

PM Modi to visit Visakhapatnam today: ప్రధాని నరేంద్రమోదీ నేడు విశాఖకు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సర్వం సిద్దమైంది. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖ రానున్న ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కాగా, ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రధాని రాష్ట్రానికి వస్తున్న వేళ.. కూటమి ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది.

చంద్రబాబు, పవన్ తో కలిసి రోడ్ షో
బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో ప్రధాని బయలుదేరనున్నారు. ఈ మేరకు సాయంత్రం 4.15 గంటలకు నేవల్ వైమానిక స్థావరం ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రధానికి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి 4.45 నుంచి 5.30 వరకు విశాఖలోని సిరిపురం కూడలి నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు దాదాపు కిలోమీటర్ మేర ఓపెన్ టాప్ వాహనంపై రోడ్​ షో జరగనుంది. ఈ రోడ్ షోలో ప్రధానితో పాటు సీఎం, డిప్యూటీ సీఎంలు పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటలకు జరగనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు.. సాయంత్రం 6.50 గంటలకు సభ ముగిసిన అనతరం విశాఖ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ప్రధాని విమానాశ్రయానికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి రాత్రి 7.15 గంటలకు భువనేశ్వర్ బయలుదేరనున్నారు.

రూ.2 లక్షల కోట్ల పనులకు పచ్చజెండా
ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో భాగంగా ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధానంగా విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద జాతీయ హరిత హైడ్రోజన్‌ మిషన్‌ కింద మొదటి గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌‍కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం అత్యాధునిక ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనపై ఏపీ సీఎస్​ కె.విజయానంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో బహిరంగ సభకు ప్రధాన వేదిక వద్ద ఏర్పాట్లపై సీఎస్ ఆరా తీశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారి ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసే ఈ సభకు విశాఖ, అనకాపల్లి, ఉత్తరాంధ్రలోని ఇతర జిల్లాల నుంచి దాదాపు 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar