Site icon Prime9

Operation Tiger T-108 : ఆపరేషన్ టైగర్.. పులి పిల్లల్ని తల్లి దగ్గరికి చేర్చడంలో విఫలం..?

operation-tiger-t-108 was failed to reunite tiger cubs to mother tiger

operation-tiger-t-108 was failed to reunite tiger cubs to mother tiger

Operation Tiger T-108 : నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో  ఇటీవల నాలుగు పులి పిల్లలను గుర్తించిన విషయం తెలిసిందే. పులి కూనలను తల్లి వద్దకు చేర్చటానికి అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముసలిమడుగు గ్రామం దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ లో పులికూనలను… తల్లి పులిని కలిపేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఆపరేషన్ మదర్ టైగర్ 108 పేరుతో యత్నాలు చేస్తున్నారు. బుధవారం నాడు కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామ సమీపాన అచ్చిరెడ్డి కుంట సమీపంలో గొర్రె కాపర్లకు పెద్దపులి కనపడింది. అ పులి రోడ్డు దాటుతుండగా.. చూసిన కాపర్లు.. కేకలు వేయడంతో.. పెద్దపులి అడవిలోకి వెళ్లిపోయింది.  వెంటనే ఎఫ్‌డీ శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకుని పాదముద్రల్ని పరిశీలించారు.

92 గంటల పాటు శ్రమించిన అధికారులు..

ఇక అధికారులు ఆ ప్రాంతానికి ప్రత్యేక వాహనాల్లో పులి పిల్లలను తీసుకెళ్లారు. ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ నేతృత్వంలోని  బృందం అలా.. అర్థరాత్రి నల్లమల అడవిలో గంటల తరబడి తల్లిపులి కోసం 92 గంటల పాటు ఎదురు చూశారు. అడవిలో ఈ నాలుగు పులి పిల్లలను వదిలి పులి కూనల అరుపులతో కృత్రిమ శబ్దాలు చేస్తూ పెద్దపులిని అక్కడికి రప్పించేందుకు ప్రయత్నం చేశారు. మూడు రోజులు గడిచినా పెద్ద పులి జాడలేకపోవడంతో.. తల్లి చెంతకు చేర్చేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే 70 ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలు ఏర్పాటు చేసి.. 350 సిబ్బంది, 50 మందికి పైగా అటవీ అధికారులు తల్లి పులి కోసం వేయి కళ్లతో గాలిస్తున్నారు. డ్రోన్ లతో కూడా తల్లి పులి జాడను పసిగట్టేందుకు పర్యవేక్షిస్తున్నారు. ఇక చివరకు పిల్లల కోసం తల్లిపులి రాకపోవటంతో ఇక చేసేదిలేక అధికారులు పులికూనలను తిరిగి ఆత్మకూరు క్యాంప్ ఆఫీసుకు తరలించారు.

ఆత్మకూరు మండలం బైర్లూటిలోని అటవీశాఖ అతిథి గృహంలో పులి కూనలను సిబ్బంది సంరక్షిస్తున్నారు. అటవీ అధికారులు తల్లికి దూరమైన ఆ పులి పిల్లలకు.. పాలు, ఆహారం అందిస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సాధారణంగా మనుషుల స్పర్శ తగిలిన పులి కూనలను తల్లి దగ్గరకు రానివ్వదు. గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ కారణంగానే ఆ పులి పిల్లల్ని జూకు తరలించాలని.. పలువురు అధికారులు సూచిస్తున్నారు.  మరోవైపు ఆ పులి పిల్లలు పాలు, నీరు, ఉడికించిన చికెన్‌ లివర్‌ను తింటున్నాయని, హుషారుగా ఆడుకుంటున్నాయని వెల్లడించారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version