Nagoba: రాష్ట్రంలో మేడారం తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన పండగ.. నాగోబా జాతర. గిరిజనులు అత్యంత ఘనంగా ఈ వేడుకను జరుపుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో ఈ జాతర జరుగుతుంది. నాగోబాకు ప్రతి పుష్యమాస అమావాస్యనాడు జాతరను నిర్వహిస్తారు. ఆదిలాబాద్ లో జరిగే అతిపెద్ద గిరిజన జాతర ఇది. మరి ఈ జాతర విశేషాలు ఏంటో తెలుసుకుందామా?
జాతర నేపథ్యం ఇదే..
పూర్వం కేస్లాపూర్ లో శేషసాయి అనే నాగభక్తుడుం.. నాగదేవతను దర్శించుకునేందుకు నాగలోకానికి వెళ్లాడట. అక్కడి ద్వారపాలకులు.. శేష సాయిని అడ్డుకొని దర్శనానికి వెళ్లనివ్వలేదు. దీంతో నిరుత్సాహానికి గురై తిరిగి వస్తుండగా.. నాగలోక ద్వారాలను తాకుతాడు. దీంతో నాగరాజు కోపంతో.. రగిలిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న శేషసాయి ప్రాణభయంతో పురోహితుడి దగ్గరకి వెళ్లి.. నాగరాజును శాంతింపజేసే మార్గం తెలుసుకుంటాడు. ఏడు కడవల ఆవుపాలతోపాటు పెరుగు.. నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర ఏడురకాల నైవేద్యాలు సమర్పించాలని చెబుతాడు. అలాగే 125 గ్రామాలమీదుగా ప్రయాణం చేసి పవిత్ర గోదావరి నీటితో నాగరాజుకు అభిషేకం చేయాలని సూచిస్తాడు. దీంతో శేషసాయి భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్ లో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ నివాస స్థలమే నేడు నాగోబాగా ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. పిల్లలు కాని దంపతులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వారికి పుట్టిన సంతానానికి నాగోరావు, నాగుబాయి లాంటి పేర్లు పెట్టుకుంటారు.
జాతరలో ప్రత్యేక కుండలు..
ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి కొత్త కుండలు. మెస్రం వంశీయులు ప్రత్యేకంగా తయారు చేయించిన కుండల్లో గంగాజలాన్ని తీసుకొస్తారు. గుగ్గిల్ల వంశీయులు మాత్రమే జాతర కోసం ప్రత్యేకంగా కుండలను తయారు చేస్తారు. ఇదికూడా వారి ఆచారంలో భాగమే. ఈ పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాతే జాతర ప్రారంభం అవుతుంది. మెస్రం వంశీయులు ఎడ్లబండ్లలో సిరికొండకు వెళ్లి.. కుండలు తయారు చేయాల్సిందిగా కోరుతారు. జాతరలో ఉపయోగించేందుకు సుమారు 130కి పైగా కుండలను తయారు చేస్తారు. ఈ కుండల్లోనే వంట చేసి జాతరలో భక్తులకు భోజనంగా పెడతారు.
పౌర్ణమినాడు మేస్రం వంశీయులు 20 మంది గిరిజనులతో కలిసి కొత్తకుండల్లో నీరు తీసుకొస్తారు.
కడెం మండలం పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువస్తారు.
ఈ జలాన్ని తీసుకురావడానికి సుమారు కాలినడకన 80 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు.
అమావాస్య నాడు నాగోబాకు గోదావరి నుంచి తెచ్చిన జలాలతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత క్షీరాభిషేకం చేసి వారి ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు.
ప్రజా దర్బారు
చివరి రోజున ప్రజా దర్బారుతో జాతర ముగుస్తుంది.
ఈ ప్రజా దర్బారుకు ప్రత్యేకత ఉంది. కొమురం భీం మరణించిన సంఘటనతో నిజాం ప్రభువు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, స్థితిగతులపై అధ్యయనం చేయడానికి నిర్ణయించారు.
అందుకు హైమన్ డార్ఫ్‌ను ఆదిలాబాద్ జిల్లాకు పంపిస్తారు.
దీంతో ఆయన దృష్టి జాతరపై పడింది. ఇక్కడే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు
. ఈ దర్బార్ ను 1946లో మొదట నిర్వహించారు. జాతర చివరి రోజున జరిగే దర్బారుకు గిరిజన పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారు.
నూతన వధువు పరిచయం
మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను నాగోబా దేవుని వద్దకు తీసుకెళతారు.
ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు.
మెస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటి దాకా వారు.. నాగోబా దేవుణ్ని చూడటానికి వీలులేదు.
నూతన వధువులు ఇంటి నుంచి వెదురు బుట్టలో పూజసామాగ్రిని పట్టుకొని, కాలినడకన బయలుదేరతారు.
అనంతరం నాగోబా గుడిని చేరుకుంటారు. ఇక్కడ పరిచయం చేయాల్సిన వధువులను భేటి కొరియాడ్ అని పిలుస్తారు.
వధువులు ఇద్దరు చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్రమానికి ముందు నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/