Site icon Prime9

Munugode Politics: మునుగోడు టీఆర్‌ఎస్‌లో ముసలం కూసుకుంట్లకు టికెట్ ఇవ్వద్దని సీఎం కేసీఆర్ కు లేఖ

Hyderabad: ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న మునుగోడులో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్టు టీఆర్ఎస్ నేతలు సంకేతాలు ఇవ్వడంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దని సీఎం కేసీఆర్‌కు కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు లేఖ రాశారు. దీంతో అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఇవాళ నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

మునుగోడు ఉప ఎన్నికలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ టికెట్ ఆశిస్తున్నారు. అయితే, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు ముఖ్యనేతలు సంకేతాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పలువురు నేతల్లో అసంతృప్తి నెలకొంది.

నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను మంత్రి జగదీశ్‌రెడ్డి రెడ్డికి అప్పగించారు సీఎం కేసీఆర్. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిగా వద్దంటున్న అసమ్మతి నేతలను మంత్రి బుజ్జగిస్తున్నారు. వారిని ప్రగతిభవన్‌కు తీసుకెళ్లిన జగదీష్‌రెడ్డి, పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి సపోర్ట్ చేసేందుకు ఒప్పించారు. మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version