Site icon Prime9

MLA Sayanna: ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు.. సర్కార్ తీరుపై అభిమానుల ఆగ్రహం

MLA Sayanna

MLA Sayanna

MLA Sayanna: హైదరాబాద్ మారేడ్‌పల్లి స్మశాన వాటికలో ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికార లాంఛనాలు లేకుండానే సాయన్న అంత్యక్రియలు జరిగాయి. అధికార లాంఛనాలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రభుత్వ తీరుపై అభిమానుల ఆగ్రహం..(MLA Sayanna)

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని అభిమానులు ఆందోళనకు దిగారు. నచ్చచెప్పేందుకు మంత్రులు తలసాని, మల్లారెడ్డి ప్రయత్నించారు. అభిమానులు వినకపోవడంతో అధికారపార్టీ నేతలు అక్కడి నుంచి నిష్క్రమించారు.. సినీ నటులకు ప్రభుత్వం అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తోందని అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకు అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ సందర్బంగా పలువురు కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు.  అయితే కుటుంబ సభ్యులు సమయం మించిపోతుందని సహకరించాలని కోరడంతో వారు శాంతించారు.

72 సంవత్సరాల సాయన్న గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందతూ నేడు మృతిచెందారు. ఆదివారం ఉదయం షుగర్‌ లెవెల్స్‌ పడిపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు సాయన్నను ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందతూ.. సాయన్న తుది శ్వాస విడిచారు. జి. సాయన్న.. 1951 మార్చి 5వ తేదీన చిక్కడపల్లిలో జన్మించారు. ఇక ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సాయన్నకు భార్య, ముగ్గుకు కుమారులు, కూతురు ఉన్నారు.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న..

సాయన్న రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. తెలుగు దేశం పార్టీతో ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సాయన్న తెదేపా తరఫున 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచారు. 2009లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకరరావు చేతిలో ఆయన ఓటమి చెందారు. 2014 తర్వాత సాయన్న భారాసలో చేరారు. 2018 ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరఫునే కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా గెలిచారు.

సాయన్న జీవితం.. తెలుగుదేశం పార్టీతో ప్రారంభించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుండి 2009 వరకు మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గజ్జెల నగేష్ పై 3275 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. ఆయన 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమితుడయ్యారు. తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ పై 37,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

సాయన్న వివాదరహితుడు, మృదుస్వభావిగా పేరు పొందారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వేలాదిమంది పేదలకు ఆయన ఇళ్లపట్టాలు ఇచ్చారు. అక్కడ మౌళికసదుపాయాలు కల్పించడానికి ఎంతగానో కృషి చేసారు. కంటోన్మెంట్ ఏరియాలోని కాలనీల ప్రజలు ఆర్మీ అధికారుల వైఖరితో ఇబ్బందిపడుతున్నారని పలుసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకు వచ్చారు.

 

Exit mobile version