Karnataka: కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ఇరా గ్రామ పంచాయితీలో ఉదయం 8.30. శ్రీనివాస్ గౌడ్ అప్పుడే గాడిదలకు పాలు పితికే షెడ్డు నుండి బయటకు వచ్చాడు. 18 ఏళ్ల పాటు కార్పొరేట్ రంగంలో పనిచేసిన గౌడ వ్యవసాయంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతను, మరికొంతమంది స్నేహితులతో కలిసి దక్షిణ కన్నడలోని ఇరా గ్రామపంచాయతీలోని పర్లడ్కలో నాలుగేళ్ల క్రితం ఐసిరి ఫామ్ (సమీకృత వ్యవసాయం మరియు పశుపోషణ, పశువైద్య సేవలు, శిక్షణ మరియు పశుగ్రాసం అభివృద్ధి సంస్థ) ప్రారంభించారు.
తనను గాడిద పెంపకంలోకి దిగడానికి కారణమైన విషయంపై, అతను మాట్లాడుతూ గాడిద జనాభా ప్రతి సంవత్సరం తగ్గుతోందని అన్నారు. 2012 నాటి జంతు గణనను ఉటంకిస్తూ, భారతదేశంలో గాడిదల సంఖ్య 3.6 లక్షలుగా ఉందని చెప్పారు. అయితే, 2019 జనాభా లెక్కల్లో ఇది 1.27 లక్షలకు తగ్గింది. దీనితో ఈ రంగంలోకి అడుగుపెట్టాలని భావించాడు. కొద్ది రోజుల క్రితమే గాడిదల ఫారమ్‌ను లాంఛనంగా ప్రారంభించినప్పటికీ, అతను గత నాలుగు సంవత్సరాలుగా ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నాడు. అతను గాడిదల గురించి మరింత అధ్యయనం చేయడానికి 2020-21 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 1.6 లక్షల కి.మీ ప్రయాణించానని చెప్పారు.
తన పొలంలో దాదాపు 20 గాడిదలు ఉన్నాయని, వాటిలో 16 నుంచి పాలు తీసుకుంటున్నట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అతను ఒక్కో గాడిద నుండి దాదాపు 300 ml పాలు పొందుతాడు. పాలను లీటరు రూ.5,000 వరకు విక్రయిస్తున్నారు. మంగుళూరు నుండి ఒక కుటుంబం రోజుకు 40 కి.మీల దూరం ప్రయాణించి ఈ ప్రదేశానికి వచ్చి పాలు తీసుకుంటుందని అతను చెప్పాడు. త్వరలోనే కస్టమర్లకు డోర్‌స్టెప్ డెలివరీ చేసే అవకాశం ఉందని తెలిపాడు ఈ పాలను మార్కెట్‌లో సరఫరా చేసేందుకు మంగళూరు మరియు ఇతర ప్రాంతాల్లోని ఆధునిక రిటైల్ అవుట్‌లెట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాలను శీతల గిడ్డంగిలో నిల్వ ఉంచితే పాలు 32 రోజుల పాటు నిల్వ ఉంచవచ్చని ఆయన చెప్పారు. గాడిద పాలను సౌందర్య సాధనాల పరిశ్రమలో ఉపయోగిస్తారని దీని మార్కెటింగ్ కు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గాడిద మూత్రం, పేడ కూడా వినియోగిస్తున్నారని, గాడిద పేడతో తయారు చేసిన ఎరువు కిలో రూ.850-1000 వరకు ఉంటుందని తెలిపారు.
గాడిద పెంపకంలో విజయం సాధించాలంటే అంకితభావం అవసరమని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దక్షిణ కన్నడలోని తన వ్యవసాయ క్షేత్రం భారతదేశంలో ప్రైవేట్ రంగంలో రెండవది అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మొదటిది కేరళలోని ఎర్నాకులంలో ఉందని ఆయన తెలిపారు.