Maharashtra Accident : మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూణె లోని పింపుల్ గురవ్ నుంచి గోరేగావ్ వెళ్తున్న బస్సు ఈరోజు తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో పూణె-రాయగడ్ సరిహద్దులో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ఈ విషాద ఘటనలో అదుపు తప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులున్నారని సమాచారం అందుతుంది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీం సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను ఆసుపత్రికి తరలించారు. రాయగడ్‌లోని ఖోపోలి ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు రాయగడ్ ఎస్పీ సోమనాథ్ ఘార్గ్ తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు కిటికీలు, పైకప్పు పూర్తిగా దెబ్బతిందని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారిని రెస్క్యూ సిబ్బంది తాళ్ల సహాయంతో సురక్షితంగా తీసుకెళ్తున్నారు. బస్సులోని ప్రయాణికులు గోరేగావ్ ప్రాంతానికి చెందిన ఓ సంస్థకు చెందినవారు. వీరంతా ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి పూణెకు వెళ్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Maharashtra: 12 dead, over 25 injured after bus falls into ditch in Raigad
Read @ANI Story | https://t.co/VOC7CfxMXh#Maharashtra #Raigad #accident pic.twitter.com/WslrRcKWIC
— ANI Digital (@ani_digital) April 15, 2023
కర్ణాటకలోని తుముకూరు జిల్లా హిరాహేళిలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఎస్‌యూవీ, ప్రైవేటు బస్సు ఢీకొన్న ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తుముకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇక పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని గర్‌శంకర్ ప్రాంతంలో శుక్రవారం నాడు ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందగా, మరో 10 మందికి గాయాలయ్యాయి.