Liquor Price Hiked in Telangana: రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మద్యం దుకాణాలకు సర్క్యూలర్ జారీ చేసింది. ఇప్పుడున్న ధరలపై 10 నుంచి 15 శాతం వరకు ధరలను పెంచింది. అయితే మద్యం ధరల పెంపు కేవలం కొన్ని బ్రాండ్లకే వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది. అలాగే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టిన ఎక్సైజ్ సెస్.. 2023లో రద్దు చేశారు. అయితే తాజాగా మళ్లీ స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను ప్రవేశపెడుతున్నట్టు సర్కార్ వెల్లడించింది. ఎక్సైజ్ సెస్ జూలై 1 నుంచి అమల్లోకి రానుంది.
కాగా పెరిగిన మద్యం ధరలను పరిశీలిస్తే.. క్వార్టర్ మద్యంపై రూ. 10, హాఫ్ బాటిల్ పై రూ. 20, ఫుల్ బాటిల్ పై రూ. 40 పెంచింది. కొన్ని మద్యం బ్రాండ్లకు ఎక్సైజ్ సెస్ ను పెట్టారు. దీంతో ఆయా బ్రాండ్ల మద్యం బాటిళ్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే మద్యం పెంపు గత ఐదు నెలల్లో ఇది రెండోసారి. ఫిబ్రవరి నెలలోనే మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా మరోసారి మద్యం ధరలను పెంచింది. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారమే ప్రభుత్వం మద్యం ధరలను పెంచినట్టు సమాచారం.
కాగా పెరిగిన మద్యం ధరలతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినెలా రూ. 130 నుంచి రూ. 150 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఒక్క బీరు బాటిల్ ధర రూ. 150 ఉంటే వ్యాట్, ఎక్సైజ్ సెస్ తో కలిపి రూ. 180 వరకు పెరగనుంది. రూ. 4,150 కి విక్రయిస్తున్న 12 ఇయర్స్ బాలంటైన్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ ధర ఇప్పుడు రూ. 4,210 కి పెరగనుంది. అలాగే రూ. 4,690కి అమ్ముడవుతున్న 12 ఇయర్స్ లైఫ్ ఉన్న జానీ వాకర్ బ్లాక్ లేబుల్ ధర రూ. 4,730 కు పెరిగింది. అయితే ధరల పెంపుపై రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని లిక్కర్ ధరల నిర్ణయ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్ శాఖ ధరల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు బీర్ల ధరలు పెరగడంతో మందు బాబులు గగ్గోలు పెడుతున్నారు.