Nagababu: ఏపీ కేబినెట్‌లోకి నాగబాబు.. జనసేన నుంచి మంత్రిగా ఎంపిక

Konidela Nagababu Confirmed as Minister in AP Cabinet: జనసేన సీనియర్ నేత నాగబాబు త్వరలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాజ్యసభ ఎంపీగా వెళ్లేందుకు విముఖత చూపిన ఆయనకు మంత్రి పదవినివ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. సోమవారం రాజ్యసభ ఎంపీల పేర్లను కూటమి ప్రభుత్వం ఖరారుచేసింది. ఈ క్రమంలో టీడీపీ నుంచి సానా సతీష్, బీద మస్తాన్ రావుల పేర్లను ప్రకటించారు. మరోవైపు, బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్య బీజేపీ తరపున రాజ్యసభ ఎన్నికల బరిలో దిగనున్నారు.

నాగబాబుకు మంత్రిపదవి
వాస్తవానికి ఈ మూడవసీటు జనసేనకు ఆఫర్ చేసినా ఆ పార్టీ దీనిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. మోపిదేవి వెంకట రమణ స్థానంలో జనసేన నుంచి నాగబాబును రాజ్యసభకు పంపుతారనే వార్తలు వచ్చినా, కేవలం రెండేళ్ల పదవీ కాలం కోసం రాజ్యసభకు వెళ్లటానికి నాగబాబు అనాసక్తి చూపినట్లు తెలుస్తోంది. అలాగే.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభలో అడుగుపెట్టాలనే ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబుకు కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ఆ రెండు వీరికే
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ఉన్న మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యలు రాజీనామా చేశారు. వీరిలో వెంకట రమణకు 2026 జూన్ 21 వరకు పదవీ కాలం ఉంది. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగాలని భావించటంతో ఈ సీటును సానా సతీష్‌కు కేటాయించారు. ఇక.. బీద మస్తాన్ రావుకు 2028 జూన్ 21 వరకు పదవీకాలం ఉంది. మరోసారి తనకే రాజ్యసభ ఛాన్స్ ఇస్తామని గతంలో ఇచ్చిన మాట మేరకు ఆయనకే మరోసీటు కేటాయించారు.

వైసీపీ టు బీజేపీ
గతంలో వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా గెలిచిన కృష్ణయ్య.. రెండేళ్ల పాటు సేవలందించారు. అయితే, కూటమి గెలుపు తర్వాత కృష్ణయ్యతో బీజేపీ నేతలతో పాటు కూటమి నేతలు చర్చలు జరిపారు. పిదప ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, పూర్తిస్థాయిలో బీసీ సమస్యలపై ఉద్యమం చేస్తానని ప్రకటించారు. కానీ, ఆయన సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ ఆయనను రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు డిసెంబరు 10 ఆఖరు తేదీ కావటంతో నేడు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.