Kakinada Port Issue: కారుచౌకగా పోర్టు కొట్టేసేందుకు గత సర్కారు కుట్ర.. అడ్డగోలుగా ఆడిట్ రిపోర్టులు, బెదిరింపులు

Kakinada Port Issue: ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ పోర్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు అక్రమంగా రవాణా అయిన రేషన్ బియ్యంపై ఐదు విభాగాల అధికారుల బృందం లోతుగా విచారణ జరుగుతుండగా, ఈ పోర్టు యాజమాన్య హక్కులను అక్రమంగా బదలాయించుకున్న తీరుపై సీఐడీ పోకస్ పెంచింది. బుధవారం పోర్టు నాటి యజమాని వెంకటేశ్వరరావు చేసిన ఫిర్యాదు ఆధారంగా గురువారం రంగంలోకి దిగిన సీఐడీ కీలక నిందితులకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గత ఐదారేళ్లుగా పోర్టు కేంద్రంగా సాగిన లావాదేవీల మీద సీఐడీ ఆరా తీస్తోంది.

విచారణ షురూ..
కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ. 3,600 కోట్ల విలువైన వాటాలను వైసీపీ పాలనలో తన మెడమీద కత్తిపెట్టి అరబిందో సంస్థకు బదలాయించుకున్నారంటూ బుధవారం పోర్టు నాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ విచారణ ఆరంభించింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని శరత్ చంద్ర రెడ్డి‌ కీలక నిందితులుగా గుర్తించి, విజయసాయి రెడ్డికి గురువారం సీఐడీ లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయనతోపాటు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని శరత్ చంద్రారెడ్డిపై ఎల్వోసీ జారీ చేసింది. ఈ ముగ్గురూ విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యూలర్ జారీ చేశారు.

2014 నుంచి పోర్టు లెక్కలు..
కాకినాడ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌(కేఎస్​పీఎల్)​లో కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఐహెచ్‌పీఎల్​)కు 41.12 శాతం వాటాతో రూ.2,15,50,905 విలువైన షేర్లు ఉండేవి. కేఎస్​పీఎల్​ 2014-15లో రూ.491.47 కోట్లు, 2015-16లో రూ.421.32 కోట్లు, 2016-17లో రూ.417.69 కోట్లు, 2017-18లో రూ.439.57 కోట్లు, 2018-19లో రూ.576.53 కోట్లు, 2019-20లో రూ.628.71 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2019-20 నాటికి ఖాతాలో రూ.240 కోట్ల నగదు నిల్వ ఉంది. అలాగే, కాకినాడ సెజ్‌కు పొన్నాడ, మూలపేట, రమణక్క పేటల్లో 8320 ఎకరాల భూములున్నాయి. అందులో కేఐహెచ్‌పీఎల్​కు, కేవీఆర్‌ గ్రూప్​నకు 48.74 శాతం వాటా ఉండగా మిగతా వాటా జీఎంఆర్​ది. 2019లో వైసీపీ సర్కారు రాగానే కేఎస్​పీఎల్ కార్యకలాపాల నిర్వహణలో పోర్టు డైరెక్టర్లు, ఏపీ మారిటైమ్‌ బోర్డు నుంచి సహకారం ఆగిపోయింది. అప్పటికి ప్రైవేట్‌ రంగంలోని ఈ కంపెనీ పూర్తిగా లాభాల్లో ఉండటమే గాక స్వల్ప అప్పులను మాత్రమే కలిగి ఉంది.

హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్
ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే 2014-2019 మధ్య కాలంలో పోర్టు లావాదేవీల మీద రాష్ట్రప్రభుత్వం ఆడిట్‌ చేయించిందని, ఆ నివేదికలో కేఎస్​పీఎల్​ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.965.65 కోట్ల నష్టం కలిగించిందంటూ తప్పుడు వివరాలను ప్రకటించారని బుధవారం నాటి ఫిర్యాదులో నాటి కాకినాడ పోర్టు యాజమాని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆ ఆడిట్‌ నివేదికను అడ్డం పెట్టుకుని వెంటనే వాటాలు బదిలీ చేయాలని తనను బెదిరించారని బాధితుడు వాపోయాడు. ఈ ఎపిసోడ్‌లో భాగంగా ముందుగా వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి 2020 మే నెలలో తనకు ఫోన్ చేసి, వైవీ సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్‌రెడ్డిని కలిసి మాట్లాడాలని చెప్పారని కేవీ రావు తన ఫిర్యాదులో వివరించారు. అక్కడ తన అల్లుడు రోహిత్‌రెడ్డి సోదరుడు, అరబిందో యజమాని పెనక శరత్‌చంద్రారెడ్డి కూడా ఉంటారని తనతో ఫోన్‌లో చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాత విక్రాంత్‌రెడ్డి కాల్‌ చేసి జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి రమ్మంటే వెళ్లానని చెప్పారు. స్పెషల్‌ ఆడిట్‌ నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వానికి కేఎస్​పీఎల్ రూ.1000 కోట్ల మేర వాటా సొమ్ము చెల్లించాలని విక్రాంత్‌రెడ్డి చెప్పారని కేవీ రావు వెల్లడించారు.

నాకు కాదు.. జగనన్నకే
కాగా, కేఎస్​పీఎల్​లో కేఐహెచ్​పీఎల్​కు 41.12 శాతం వాటా, వ్యక్తిగతంగా తనకు 20 షేర్లు మాత్రమే ఉన్నాయని తాను విక్రాంత్​రెడ్డికి చెప్పినట్లు కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. దానికి విక్రాంత్ రెడ్డి బదులిస్తూ.. ‘ఇది నా కోసం కాదు.. సీఎం జగన్‌ కోసమే. దీనికి సహకరించకపోతే మీరు, మీ కుటుంబసభ్యులు క్రిమినల్‌ కేసులు, విజిలెన్స్‌ విచారణలు ఎదుర్కోక తప్పదు. తర్వాత అరెస్ట్, జైలుకు పోవటమూ ఖాయం’ అని అన్నట్లు కేవీరావు వెల్లడించారు. తాము చెప్పినట్లుగా వాటాలు వదులుకున్నందుకు కొంత సొమ్ము బదిలీ చేస్తామని కూడా విక్రాంత్ రెడ్డి చెప్పాడని, మూడు రోజుల తర్వాత సంతకాలకు రెడీ కావాలని ఆదేశాలిచ్చాడని కేవీ రావు తెలిపారు. ఈ లోగా సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ దొరకలేదన్నారు.

మొత్తం… 12 కోట్లకే
రూ.12 కోట్లకు వాటాలు అమ్ముతున్నట్లు ఒప్పందపత్రం రూపొందించి తమ చేత 2020 అక్టోబర్ 12న బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. ఈ వాటాల బదిలీ పూర్తయిన తర్వాత అరబిందో సంస్థ కాకినాడ సెజ్‌లో వాటాదారుగా మారిందని చెప్పారు. అదే సమయంలో కాకినాడ సెజ్‌లో జీఎంఆర్‌ గ్రూప్​నకు ఉన్న వాటాను కూడా అరబిందో కొనేసిందన్నారు. దీంతో మొత్తం 100 శాతం వాటాలు అరబిందో పరమయ్యాయని వివరించారు. కాకినాడ సెజ్‌కు అనుబంధ సంస్థ అయిన కాకినాడ గేట్‌వే పోర్ట్స్‌ లిమిటెడ్‌ కూడా వారి సొంతమైందన్నారు. సంతకాలు చేసిన కొద్ది రోజుల తర్వాత కేఐహెచ్​పీఎల్​ ఖాతాకు రూ.100 కోట్లు జమ చేశారని ,ఆ తర్వాత కొద్ది రోజులకు విక్రాంత్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి తనను విజయవాడ పిలిపించి సీఎం జగన్‌ దగ్గరకు తీసుకెళ్లారని, అక్కడ జరిగినదంతా విక్రాంత్​రెడ్డి సీఎంకు వివరించారని, ఆ సమయంలో తాను నిరసన తెలిపేందుకు యత్నించగా సీఎం నోరెత్తనీయలేదన్నారు. దీంతో ఇదంతా సీఎం కోసమేనని అర్థమైందని కేవీ రావు ఫిర్యాదులో తెలిపారు.

నేరుగా అరెస్టులు..
ఈ నేపథ్యంలో ఈ మొత్తం ఎపిసోడ్‌ ఎలా జరిగింది? డీల్ కోసం వెంకటేశ్వరరావును తీసుకుపోయినప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌లో ఏం జరిగింది? ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఆ రోజు ఘటనకు సాక్షులెవరు? హైదరాబాద్‌లో విక్రాంత్‌ రెడ్డి ఇంటికెళ్లినప్పుడు కేవీ రావుతోపాటు ఎవరైనా వెళ్లారా వంటి అంశాలను పరిశీలించిన సీఐడీ కేవీ రావు వాంగ్మూలం రికార్డు చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసే అవకాశాలపైనా సీఐడీ కసరత్తు చేసినట్లు సమాచారం. ఏడేళ్లకు పైగా శిక్షలు పడే సెక్షన్లు ఉన్నందున ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయాలని సీఐడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.