Jagannadh Ratha Yatra : త్రిపుర లోని ఉనకోటి జిల్లా కుమార్ ఘాట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నిర్వహించిన జగన్నాథ ఉల్టా రథయాత్రలో రథం హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకడంతో విద్యుదాఘాతం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 15 మందికి తీవ్రంగా గాయలైనట్లు తెలుస్తుంది. కాగా మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉండడం మరింత విషాదాన్ని కలిగిస్తుంది. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బుధవారం జగన్నాథ ఉల్లా రథయాత్ర నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో జగన్నాథ బారి ఆలయానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇనుముతో చేసిన రథాన్ని జనం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ హైటెన్షన్ వైర్లను రథం తాకింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తో మంటలు చెలరేగాయి. ఈ నెల 20న జగన్నాథ రథయాత్ర ప్రారంభం కాగా, ఉల్టాయాత్ర దీనికి ముగింపుగా నిర్వహిస్తారు.
ప్రమాదంలో గాయపడిన వారిని కైలాషహర్‌లోని ఉనకోటి ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఇక భారీ వర్షాలు కురుస్తుండడంతో హెలికాప్టర్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దాంతో పరిస్థితిని సమీక్షించేందుకు అగర్తలా నుంచి సీఎం రైలు ద్వారా కుమార్‌ఘాట్‌కు బయలుదేరారు.