Site icon Prime9

IPL 2023 DC vs GT : ఢిల్లీ క్యాపిటల్స్ ని మట్టికరిపించిన గుజరాత్ టైటాన్స్.. వరుసగా రెండో విక్టరీ

interesting details about IPL 2023 DC vs GT match

interesting details about IPL 2023 DC vs GT match

IPL 2023 DC vs GT : ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2023 సీజన్-16లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.  ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇచ్చిన 163 పరుగుల లక్ష్యాన్ని..  18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సులువుగా ఛేదించింది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం.

163 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు ముందు నుంచి ధాటిగా ఆడారు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (14), శుభ్ మాన్ గిల్ (14), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (5) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. కానీ  యంగ్ బ్యాట్స్ మెన్ సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో చెలరేగి గుజరాత్ కి విజయాన్ని మరింత చేరువ చేశాడు.  48 బంతుల్లో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. డేవిడ్ మిల్లర్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. అలానే విజయ్ శంకర్ 29, సాహా 14, గిల్ 14 పరుగులతో రాణించారు. ఇక గుజరాత్ టైటాన్స్ విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 12 పరుగులే కావాల్సి వచ్చాయి. ఖలీల్ అహ్మద్ వేసిన 18వ ఓవర్‌లో 10 పరుగులు రాగా మిచెల్ మార్ష్ వేసిన 19వ ఓవర్‌లో మ్యాచ్‌ని ముగించేశాడు డేవిడ్ మిల్లర్. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఆన్రిచ్ నోర్జే 2 వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ చెరో వికెట్ తీశారు. అర్ధసెంచరీతో గుజరాత్‌ను గెలిపించిన సాయి సుదర్శన్‌కు ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

 

ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (7), ఆల్ రౌండ్ మిచెల్ మార్ష్ (4), రిలీ రూసో (0) విఫలమయ్యారు. కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌ (37; 32 బంతుల్లో 7 ఫోర్లు), సర్ఫరాజ్ ఖాన్ (30; 34 బంతుల్లో) రాణించగా మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు. వికెట్ కీపర్ పోరెల్ 2 సిక్సులు బాదాడు. ఆఖర్లో అక్షర్‌ పటేల్ (36; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ తలో 3 వికెట్లు పడగొట్టారు. అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు తీశాడు. తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలోనూ ఢిల్లీ ఓటమిపాలైంది. ఆడిన రెండు మ్యాచుల్లో రెండు వరుస విజయాలతో గుజరాత్ జట్టు పాయింట్ల టేబుల్ లో టాప్ పొజిషన్ కి చేరింది.

ఈ మ్యాచ్‌కి ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషబ్ పంత్ హాజరయ్యాడు. కాలికి కట్టుతో, కళ్లకు కూలింగ్ గ్లాసెస్‌తో రిషబ్ పంత్‌ స్టేడియంలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారాడు. కారులో స్టేడియానికి వచ్చిన రిషబ్ పంత్‌ని స్వయంగా స్వాగతం పలికిన ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్, అతని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గత ఏడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, నాలుగు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు. మోకాలికి శస్త్ర చికిత్స జరగడంతో నడవడానికి కూడా కష్టపడుతున్న రిషబ్ పంత్, ఇప్పుడిప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు.

 

Exit mobile version