Andhra Pradesh: స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్ ప్రదర్శనను సీఎం జగన్ తిలకించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతీయుల గుండె అని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అల్లూరి త్యాగాన్ని స్మరించుకోవాలన్నారు. 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని జగన్ తెలిపారు. స్వాతంత్ర్యం నాటికి18 శాతం సాగు భూమికి నీరందించారన్నారు. ఇప్పుడు 49 శాతం వ్యవసాయ భూమికి నీటి సదుపాయం ఉందని అన్నారు.
ప్రపంచ ఫార్మా రంగంలో దేశం మూడో స్థానంలో ఉందన్నారు. దేశం దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి వేగంగా అడుగులు వేసిందన్నారు.స్వాతంత్ర్యం తర్వాత దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని సీఎం జగన్ అన్నారు. ప్రపంచదేశాలతో భారత్ పోటీ పడుతోందన్నారు. ఆహారధాన్యాల లోటును అధిగమించి ముందడుగు వేశామని చెప్పారు. అర్హులైన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో మరో అధ్యాయం జిల్లాల పెంపు అని సీఎం జగన్ తెలిపారు.
అనంతరం వివిధ శకటాల ప్రదర్శన అట్టహాసంగా జరిగింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనేటి విందు ఇవ్వనున్నారు. ఈ ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకానున్నారు.