KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికలో తనను గెలిపిస్తే మునుగోడును అమెరికా మాదిరిగా మారుస్తానని కూడా హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా అధికారులపై కేఏ పాల్ సీరియస్ అయ్యారు. తాను తెలంగాణ నెక్ట్స్ సీఎం అంటూ రచ్చ రచ్చ చేశారు.
మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కేఏ పాల్ వాహనాన్ని అధికారులు నిలిపివేశారు. దాంతో వారిపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే ఆపుతారా అని ప్రశ్నించారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ తన ఫాలోవర్ అని చెప్పిన కేఏ పాల్.. ఓ అధికారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఆ అధికారిని.. నీ పేరేమిటి..? అంటూ మెడలో నుంచి ఐడీ కార్డును లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడే ఉన్న మరికొందరు ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేవారు. జాగ్రత్తగా ఉండండి.. తెలంగాణకు కాబోయే సీఎం తానేనని అన్నారు. తరువాత కొంతసేపటికి కేఏ పాల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్ మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఉంటారని కేఏ పాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం కే ఏ పాల్‌కు ఉంగరం గుర్తు కేటాయించింది. దీంతో ఆయన ఓటర్ల వద్దకు వెళుతూ.. ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు