High Tension In Patancheru Congress Leaders Protest Against MLA Gudem Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంపు ఆఫీస్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు లేదంటూ కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ వర్గీయులు ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు ఆ క్యాంపు కార్యాలయంలోకి కాంగ్రెస్ నేతలు దూసుకెళ్లారు. అనంతరం అక్కడ కేసీఆర్ ఫోటో తీసేసి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో తీసేశారు.
ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిపాల్ రెడ్డి గతేడాది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలను పట్టించుకోవడం లేదని కాటా శ్రీనివాస్ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.
విషయం తెలుసుకున్న పోలీసులు కాటా అనుచరులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కొంతమంది నేతలు క్యాంపు ఆఫీసు గోడ దూకి లోపలికి ప్రవేశించారు. అనంతరం అక్కడ కుర్చీలను ధ్వంసం చేశారు. మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.