Site icon Prime9

Harish Rao: ప్రజా కోర్టులో శిక్ష పడేంత వరకు ఆగను.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

Harish Rao Fires on CM Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై నమోదైన కేసు విషయమై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనపై ఎందుకు కేసులు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ‘మిస్టర్‌ రేవంత్‌.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులు బనాయిస్తున్నావు’అని మండిపడ్డారు. ‘నువ్వు లక్ష కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజాతీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను’అంటూ రాసుకొచ్చారు.

ఎగవేతల రేవంత్.. గుణపాఠం తప్పదు…
రుణమాఫీ విషయంలో దేవుళ్లను దగా చేశావని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై తప్పుడు కేసు పెట్టించాడని రేవంత్ పై మండిపడ్డారు. హామీలను ఎగవేస్తున్నందుకు ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించావన్నారు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పీఎస్ లో తనకు సంబంధం లేని కేసు పెట్టించావని విమర్శించారు. నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక పంజాగుట్ట స్టేషన్‌లో మరో తప్పుడు కేసు పెట్టించారని తెలిపారు.

హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో అక్రమ కేసు
మాజీ మంత్రి హరీశ్‌ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. తన ఫోన్‌ను ట్యాపింగ్‌ చేశారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్‌ జూబ్లీహిల్స్‌ ఏసీపీకి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. హరీశ్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన రాధాకిషన్ రావుపై కేసు నమోదైంది. 120 (బీ), 386,409,506 , రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

డిసెంబర్ పవిత్ర మాసం
డిసెంబర్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ సంతోషంగా ఉంటారని హరీశ్‌రావు అన్నారు. ఇది అత్యంత పవిత్రమైన మాసంగా భావించి నిత్యం పండుగలా జరుపుకుంటారని తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని సీఎస్‌ఐ వెస్లీ చర్చిలో గాడ్‌ విజన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌లో పాల్గొని మాట్లాడారు. ఏసు ప్రభు ప్రేమ, దయా గుణం, కరుణ, శాంతిని అందరిలో పెంపొందించారని పేర్కొన్నారు. ఏసుప్రభు క్షమాగుణం అందరికీ ఆదర్శమని కొనియాడారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువమంది జరుపుకునే పండుగ క్రిస్మస్ అన్నారు. దేశంలో క్రిస్మస్ పండుగను అధికారికంగా జరిపిన ఒకే ఒక సీఎం కేసీఆర్ అన్నారు. హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా అందరినీ సమానంగా చూసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు.

శ్రీకాంతాచారికి నివాళులర్పించిన హరీశ్‌ రావు
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా హరీశ్‌రావు నివాళులర్పించారు. అగ్నికి ఆహుతి అవుతూ ‘జై తెలంగాణ’అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించిన పోరాట యోధుడు శ్రీకాంతాచారి అని చెప్పారు. కేసీఆర్ అరెస్టును, ఉద్యమకారులపై ప్రభుత్వ అణచివేతను సహించలేక ఆత్మబలిదానం చేసుకున్న తెలంగాణ అమరుడని తెలిపారు. జోహార్ శ్రీకాంతాచారి అంటూ ట్వీట్‌ చేశారు.

Exit mobile version