Site icon Prime9

Google Safety Engineering Center: హైదరాబాద్‌లో గూగుల్ సైబర్ సేప్టీ సెంటర్.. గూగుల్‌తో సర్కారు కీలక ఒప్పందం

Google To Establish Google Safety Engineering Center in hyderabad: తెలంగాణలో భారీ పెట్టుబడులకు గూగుల్ సంస్థ సిద్ధమైంది. ఈ క్రమంలో బుధవారం తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోనే తొలి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ)ను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్‌ తెలిపారు. ఈ మేరకు సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో గూగుల్ ప్రతినిధి బృందం.. సీఎం, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమైంది. ఈ సందర్బంగా ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.

అందుకే ఇక్కడకు..
గూగుల్ చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ హాన్సెన్ మాట్లాడుతూ.. డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఐటీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా ఉందని తెలిపారు. ఇప్పటికే ప్రపంచంలో పేరొందిన ఐదు టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్ ఇక్కడే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం సేఫ్టీ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా సైబర్ సేఫ్టీ సమస్యలను వేగంగా పరిష్కరించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన గూగుల్ ఫర్ ఇండియా 2024 కాన్‌క్లేవ్‌‌లో తమ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ నిర్మాణం గురించి సంస్థ ప్రతినిధులు ప్రకటన చేశారు. నాటినుంచి పలు రాష్ట్రాలు దానిని తమ వద్ద ఏర్పాటు చేయాలంటూ ప్రతిపాదనలు పంపాయి. కానీ గూగుల్ సంస్థ మాత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

ప్రపంచంలోనే ఐదవది..
హైదరాబాద్ వేదికగా స్థాపిస్తున్న ఈ సెంటర్.. ప్రపంచంలోనే ఐదవది. ఏషియా పసిఫిక్ జోన్‌లో.. టోక్యో అనంతరం ఏర్పాటు చేస్తున్న రెండో సెంటర్ ఇదే కావడం గమనార్హం. అధునాతన భద్రతతోపాటు ఆన్‌లైన్ భద్రత ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుంది. అంటే.. ప్రత్యేకమైన అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్ అని చెప్పవచ్చు. అత్యాధునిక పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారత భద్రత, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు ఈ సేఫ్టీ సెంటర్ సహకార వేదికగా ఉపయోగపడనుంది.

ఐటీకి చిరునామా.. తెలంగాణ
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఈ సేఫ్టీ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ ముందుకు రావటం చాలా ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. గూగుల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య ఒప్పందం చేసుకోవటంతో మరోసారి హైదరాబాద్ మహానగరం ప్రపంచంలో మేటీ ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

Exit mobile version