Google Signs Agreement With AP Government Minister Nara Lokesh: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టిజి శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఎపి రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ మధ్య అమరావతిలోని సచివాలయంలో నేడు అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందపత్రాలపై ఇరువర్గాల ప్రతినిథులు సంతకాలు చేశారు.
నైపుణ్యాల పెంపునకు ఏఐ
ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఎఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీంతోపాటు స్టార్టప్ లు, సాంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఎఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సుస్థిరత వంటి కీలకమైన అంశాల్లో ఎఐ&ఎంఎల్ సొల్యూషన్స్ ను ఏకీకృతం చేయడానికి గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తుంది.
ఏఐ ఆధారిత వ్యవస్థలో ఆర్థిక వృద్ధి చెందడానికి అవసరమైన శిక్షణ, వనరులను యువతకు అందించడం ద్వారా నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి గూగుల్ సంస్థ సహకారాన్ని అందిస్తుంది. దీంతోపాటు ఎఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు గూగుల్ సంస్థ సహకారాన్ని అందిస్తుంది. ఎంఓయు సందర్భంగా అమరావతి సెక్రటేరియట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈడిబి సిఇఓ సాయికాంత్ వర్మ, ఆర్టీజిఎస్ సీఈఓ దినేష్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఎపి ప్రభుత్వ ఇన్వెస్టిమెంట్స్ విభాగం ఉన్నతాధికారి యువరాజ్ పాల్గొన్నారు.