Gollabhama Sarees: తెలంగాణ మంత్రి హరీష్ రావు సిద్దిపేట నేతన్నలను ట్విట్టర్ వేదికగా అభినందించారు. కళా నైపుణ్యానికి వన్నె తెచ్చిన నేతన్నలతోనే గొల్లభామ చీరలకు యునెస్కో గుర్తింపు రావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. నేత చీరల్లో సిద్దిపేట నేతన్నలది ప్రత్యేక స్ధానం అన్నారు. మగ్గం వేసిన గొల్లభామ చీరలు మహిళల సింగారానికి నిలువెత్తు అద్దంగా పేర్కొన్నారు.
మహిళామణులను అత్యంతంగా మెరిసిపోయేలా నేతన్నలు తయారుచేసే గొల్లభామ చీరలకు ఆరు దశాబ్ధాల చరిత్ర ఉందన్నారు. పల్లెటూరు అందానికి ప్రతీకగా నెత్తిన చల్లకుండ, కుడిచేతిలో గురిగె, కాళ్లకు గజ్జెలు, జడకొప్పులో తురిమిన పూలతో అలరించిన అలనాటి గొల్లభామకు తెలంగాణాలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. అంతటి ప్రాచుర్యం పొందిన గొల్లభామ చీరలకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించడం ఆనందించదగ్గ విషయమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా గొల్లభామ చీరల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇందుకోసం జౌళి శాఖ ఆధ్వర్యంలో గోల్కొండ షోరూంలలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసిన్నట్లు పేర్కొన్నారు. వనితల సింగారం దారాల్లో ఇమిడిపోతే, ఆ ముగ్ధత్వం చీరల్లో మెరిసిపోయేలా చేసేదే గొల్లభామ చీర ప్రత్యేకత అంటూ నేతన్నలను మంత్రి హరీష్ ఈ సందర్భంగా అభినందించారు.
ఇది కూడా చదవండి:Uttarandhra: ఉత్తరాంధ్రలో రాజధాని రైతుల పర్యటనను అడ్డుకొంటా…ఎమ్మెల్సీ